వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం.. కేసీఆర్​తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం : షర్మిల

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం..  కేసీఆర్​తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం : షర్మిల

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల చెప్పారు. బీఆర్ఎస్​తో పొత్తుపై బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​కు వ్యతిరేకమని ప్రకటిస్తేనే, ఆ పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు గానీ, తర్వాత గానీ బీఆర్ఎస్​తో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. గురువారం హైదరాబాద్ గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

‘‘పార్టీని విలీనం చేస్తానంటూ ప్రచారం చేస్తూ.. మూడేండ్లుగా నేను పడిన కష్టాన్ని అవమానిస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. పొత్తుల కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. పొత్తులు అనేది రేపటి అంశం. మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నం” అని షర్మిల తెలిపారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ ఇన్నేండ్లు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగాయి. ప్రజా సమస్యలపై ఆ పార్టీలు ఆందోళనలు చేయలేదు. నేను పార్టీ పెట్టిన వెంటనే ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టాను” అని చెప్పారు.

కాంగ్రెస్.. అమ్ముడుపోయే పార్టీ

కేసీఆర్​కు ఎమ్మెల్యేలను సప్లయ్ చేసే కంపెనీగా కాంగ్రెస్ మారిందని షర్మిల కామెంట్ చేశారు. ‘‘కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్ఎస్​కు వేసినట్లే. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామంది బీఆర్ఎస్​లో చేరారు. అమ్ముడుపోయే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ఆపే నాయకత్వం కాంగ్రెస్​లో ఉందా? కేసీఆర్​కు కాంగ్రెస్  మళ్లీ సప్లయ్ కంపెనీగా మారదనే గ్యారెంటీ ఏంటి? ఈసారి కేసీఆర్​కు 30కి మించి సీట్లు రావు. అప్పుడు కేసీఆర్​కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదనే గ్యారెంటీ ఏంటి? కాంగ్రెస్ జవాబు చెప్పాలి” అని అన్నారు.

ఏం సాధించారని ఉత్సవాలు? 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఏం సాధించారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​కు దమ్ముంటే తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ చేస్తూ.. 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్​ను రిలీజ్ చేశారు.