కేసీఆర్ కు కౌంటర్ గానే.. నాడు వైఎస్ఆర్ వ్యాఖ్యలు!!

కేసీఆర్ కు కౌంటర్ గానే.. నాడు వైఎస్ఆర్ వ్యాఖ్యలు!!
  • ఆంధ్రావాళ్లపై కేసీఆర్ విషం కక్కినందుకే  అప్పట్లో రాజశేఖర్ రెడ్డి  స్పందించారు 
  • మొత్తం నిజం చెప్పే ధైర్యం కేటీఆర్ కు లేదు
  • వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల 

‘తెలంగాణ ఏర్పడితే.. పాస్ పోర్టు తీసుకొని హైదరాబాద్ కు విమానంలో వెళ్లాల్సి వస్తుంది ’ అని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కామెంట్స్ చేశారంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో  ఆమె మాట్లాడారు. మొత్తం నిజం చెప్పే ధైర్యం మీకు లేదా ? అని కేటీఆర్ ను ఆమె ప్రశ్నించారు. ఆనాడు ఏ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ‘ఆంధ్రా వాళ్లను వెళ్లగొడతాం. ఆంధ్ర సంస్థలను మూసేస్తం. ఆంధ్రాకు చెందిన విద్యా సంస్థలు, ఇండస్ట్రీలను తీసేస్తమని ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్  అలా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది’ అని షర్మిల గుర్తు చేశారు. అవసరమైనప్పుడల్లా  తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం తప్ప టీఆర్ఎస్ కు ఏమీ తెలియదన్నారు.

టీఆర్ఎస్ బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు..

టీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఇప్పుడు రూ.860 కోట్లు ఉన్నాయని, వాటికి ప్రతినెలా వడ్డీగా రూ.3 కోట్లు వస్తున్నాయని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఖాతాలో రూ.25 కోట్ల దాకా వడ్డీ జమైందన్నారు. ఈ అసలు, వడ్డీని ఏం చేసుకోవాలో టీఆర్ఎస్ వాళ్లకు అర్ధం కావడం లేదని చెప్పారు. టీఆర్ఎస్  ఖాతాలోనే రూ.860 కోట్లుంటే.. కేసీఆర్ ఖాతాలో, ఆ పార్టీ ఎమ్మెల్యేల ఖాతాల్లో ఇంకెన్ని కోట్లుండాలని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి.. దేశమంతా ఉద్ధరిస్తానని కేసీఆర్ చక్కర్లు కొడుతుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 60 ఏళ్లలోపు చనిపోయిన అన్నదాతలకే  రైతుబీమా వర్తిస్తుందనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తేవడాన్ని షర్మిల తప్పుపట్టారు. ‘‘సీఎం కేసీఆర్ ఎన్నేళ్లయినా బతకొచ్చు. రైతులు మాత్రం 60 ఏళ్లే బతకాలా ? ఆ వయసు తర్వాత రైతులు చనిపోతే బీమా పరిహారం ఇవ్వరా ?  ఇదెక్కడి అన్యాయం ? ’’ అని ఆమె  ధ్వజమెత్తారు. తన పాదయాత్ర ఇటీవల ఖమ్మంలోని సత్తుపల్లిలో ముగిసిందన్నారు. మళ్లీ యాత్రను అక్కడి నుంచి మొదలుపెట్టి నల్లగొండలోని దక్షిణ ప్రాంత నియోజకవర్గాల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా వరకు కొనసాగిస్తానని వెల్లడించారు.

మరిన్ని వార్తలు.. 

ఐదు పదుల వయసులో ‘ఖుష్బూ’ కొత్త లుక్

మంకీపాక్స్ టెస్టుకు RT-PCR కిట్