పాలేరు నుంచి షర్మిల పోటీ.. నవంబర్ 4న నామినేషన్

పాలేరు నుంచి షర్మిల పోటీ.. నవంబర్  4న నామినేషన్

హైదరాబాద్/ఖమ్మం రూరల్‌‌, వెలుగు: వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్‌‌ షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 4న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. అలాగే, 1వ తేదీ నుంచి పాలేరు నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని తెలిపింది. ఆదివారం నియోజకవర్గంలో పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్ జరిగింది. దీనికి విజయమ్మ హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దు కావడంతో పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్‌‌లో వైఎస్సార్‌‌‌‌టీపీని విలీనం చేసినా, పొత్తు పెట్టుకున్నా పాలేరుతో పాటు మరికొన్ని సీట్లు ఇవ్వాలని షర్మిల కోరారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండడం, పొంగులేటి పోటీ చేయాలనుకున్న కొత్తగూడెం పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలకు ఇస్తుండడం, మాజీ మంత్రి తుమ్మల పార్టీలో చేరడంతో షర్మిల ప్రతిపాదనకు కాంగ్రెస్‌‌ హైకమాండ్ ఒప్పుకోలేదు. 

ఇటీవల ఇచ్చిన రెండో లిస్ట్‌‌లో పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు బరిలోకి దిగనున్నట్లు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌‌కు గెలుపు అవకాశాలు ఉన్న టైమ్‌‌లో షర్మిల పార్టీని విలీనం చేయడం, పొత్తు పెట్టుకోవడాన్ని పీసీసీ నేతలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. పాలేరుకు బదులు వేరే సీటు ఇస్తామని, వచ్చే ఏడాది కర్నాటక నుంచి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ చేసినా షర్మిల అంగీకరించలేదు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకునే టైమ్‌‌లో మిర్యాలగూడ నుంచి షర్మిల, పాలేరు నుంచి విజయమ్మ, సికింద్రాబాద్ నుంచి బ్రదర్ అనిల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా పాలేరు నుంచే బరిలోకి దిగాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఖమ్మం రూరల్‌‌ మండలం సత్యనారాయణపురంలో జరిగిన వైఎస్సార్‌‌‌‌టీపీ పాలేరు నియోజకవర్గ బూత్‌‌ లెవల్‌‌ కార్యకర్తల సమావేశంలో పిట్టా రాంరెడ్డి మాట్లాడారు. పాలేరులో పోటీ చేయనున్న షర్మిలను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ప్రజా సేవ చేసేందుకు షర్మిల పాలేరు బరిలో ఉండబోతున్నారని, నియోజకవర్గ ప్రజలు ఆమెకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ విలీనం, పొత్తు విషయంలో కాంగ్రెస్‌‌ పార్టీ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.