పోలీసులపై కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నం : షర్మిల

పోలీసులపై కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నం : షర్మిల

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పోలీసుల భుజాన తుపాకులు పెట్టి సీఎం కేసీఆర్ తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను కార్యకర్తల్లా, కీలుబొమ్మల్లా వాడుకుంటున్న ముఖ్యమంత్రి తన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని షర్మిల మండిపడ్డారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున పోలీస్ డిపార్ట్మెంట్పై కేసు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కనీసం వైఎస్సార్టీపీ కార్యకర్తల్ని పార్టీ ఆఫీసులోకి రానివ్వకపోవడంపైన కూడా కేసు నమోదుచేయనున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న పరువు తీసేశాడని షర్మిల విమర్శించారు. తన ఆమరణ దీక్ష భగ్నం చేయడంతో పాటు వైఎస్సాఆర్టీపీ కార్యకర్తల్ని ఆఫీసుకు రానీయకుండా బారికేడ్లు పెట్టి వారిని వ్యాన్లలో ఎక్కించుకుని తీసుకుపోతున్నారని ఆరోపించారు. కనీసం మీడియాను కూడా అనుమతించే పరిస్థితి లేకుండా పోయిందని షర్మిల వాపోయారు. తెలంగాణ పని అయిపోయిందని ఇప్పుడు కేసీఆర్ బందిపోట్ల రాష్ట్ర సమితి పేరుతో దేశం మీద పడ్డాడని షర్మిల సటైర్ వేశారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయిందని, కనీసం న్యాయవ్యవస్థ అయినా బతికే ఉందన్న ఆశతో కేసు ఫైల్ చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. 

సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నానన్న ఆమె.. ఆగిన చోట నుంచే యాత్ర తిరిగి మొదలుపెడతామని అన్నారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యాత్రకు అనుమతించాలని షర్మిల డిమాండ్ చేశారు.