రేపు రాజ్ భవన్‭కు వైఎస్ షర్మిల.. గవర్నర్‭తో భేటీ

రేపు రాజ్ భవన్‭కు వైఎస్ షర్మిల.. గవర్నర్‭తో భేటీ

తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళి సైతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నేరుగా రాజ్ భవన్‭కు వెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ కు వివరించనున్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తమిళి సైకి వినతిపత్రం అందించనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. అయితే గతంలో షర్మిలను అరెస్ట్‌ చేసిన తీరును తమిళిసై ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు, ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్ కూడా చేశారు.