ప్రత్యేక హోదాపై షర్మిల ట్వీట్... సీఎం చంద్రబాబుకు చురకలు

ప్రత్యేక హోదాపై షర్మిల ట్వీట్... సీఎం చంద్రబాబుకు చురకలు

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేక హోదా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు చురకలు అంటించారు షర్మిల. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదని అన్నారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు షర్మిల.

రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే ఏపీ వెనకబడి ఉందని తెలియదా అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ?  హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదని దుయ్యబట్టారు. మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని... రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ ట్వీట్ చేశారు షర్మిల.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు గడిచినా.. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఎన్నికల ప్రచారానికే పరిమితం అయ్యింది. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం హోదా అంశాన్ని పట్టించుకోకపోవటం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా అన్న అంశం దాదాపు అటకెక్కే పరిస్థితికి వచ్చింది. అయితే, 2024 ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవటంతో టీడీపీ, జనతాదళ్ లాంటి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి, ఇప్పుడైనా చంద్రబాబు కేంద్రం ముందు ప్రత్యేక హోదా ప్రతిపాదన పెట్టి హోదా సాధిస్తారా లేదా వేచి చూడాలి.