మేము జోక్యం చేసుకోలేము.. వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

మేము జోక్యం చేసుకోలేము..  వివేకా హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసుపై సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించిన నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ.. వివేకా కూతురు సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ( సెప్టెంబర్ 16 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పటికే సీబీఐ ఫైనల్‌ ఛార్జిషీట్‌ ఫైల్ చేసిన క్రమంలో నిందితుల బెయిల్ రద్దు విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

అయితే, తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు. వివేకా హత్య కేసుకి సంబంధించి సీబీఐ చార్జిషీట్ ఇప్పటికే దాఖలైందని.. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలు ట్రయిల్ కోర్టు ఎదుట ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

కోర్టులో ఇలా అప్లికేషన్స్ వేస్తూ వెళ్తే.. ట్రయిల్ పూర్తి కావడానికే దశాబ్ద సమయం పడుతుందని.. ఇప్పుడు మేము చేసేది ఏముందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో వివేకా హత్య కేసు నిందితులకు ఊరట లభించిందని చెప్పాలి. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.