
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. 2జీ స్పెక్ర్టమ్, కోల్ స్కాం కంటే కాళేశ్వరం నిర్మాణం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీగా వెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని షర్మిల చెప్పారు.
అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.38 వేల 500 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూపొందించారని, దీని ద్వారా 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని ప్లాన్ చేశారని వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్ పేరుతో ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి ... కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాతమ్రే నీళ్లు ఇచ్చేలా నిర్మాణం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం అట్టర్ ప్లాప్ అయిన ప్రాజెక్టు అని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది అవసరం లేని ప్రాజెక్టన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదంటారా..? విచారణ జరగవద్దంటారా..? కనీసం క్వాలీటీ అయినా ఉందా..?’ అని ప్రశ్నించారు.
గతంలో గోదావరి నదికి ఎంత పెద్ద వరద వచ్చినా స్థానిక రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ తో రైతుల పంటలు ముప్పునకు గురవుతున్నాయని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బ్యాక్ వాటర్ తో నష్టపోయిన ఏ ఒక్కరైతుకు అయినా నష్టపరిహారం చెల్లించారా...? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేపట్టిన 80 శాతం ప్రాజెక్టులను ఒకే ఒక కాంట్రాక్టర్ కు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా సీఎం కేసీఆర్ నెరవేర్చారా..? అని మండిపడ్డారు.
తాను రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తున్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మార్చి 14న తాము తలపెట్టిన ర్యాలీకి తెలంగాణ ఎంపీలు మద్దతు తెలపాలని వైఎస్ షర్మిల కోరారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎలా మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాలకు గొంతు విప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు. తనను రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్ర చేసుకోనివ్వడం లేదన్నారు. పాదయాత్ర చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.