ఉద్యమకారులను కేసీఆర్ అవమానిస్తున్నడు

ఉద్యమకారులను కేసీఆర్ అవమానిస్తున్నడు
  • కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరు
  • ఒక్క రైతు బంధు ఇస్తూ అన్నీ బంద్​ పెట్టిండు: షర్మిల ఫైర్​

వికారాబాద్/ నారాయణపేట/  మద్దూర్ ​వెలుగు: జనం బాధలు పట్టని, రైతులు చనిపోయినా కనీసం పరామర్శించని సీఎం మనకు అవసరమా అని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్​ ఫామ్​హౌస్​ వీడడం లేదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమకారులు పోరాడితే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్​దోపిడీ పాలన సాగిస్తున్నారన్నారు. శనివారం ఆమె వికారాబాద్​ జిల్లా దౌల్తాబాద్​ మండలం, కొడంగల్​ నియోజకవర్గం మద్దూర్​ మండలంలో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించారు. గోకఫసల్వాద్, దమగన్​పూర్​ గ్రామాల్లో  షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని  కేసీఆర్​ నిరంకుశంగా పాలిస్తూ అప్పుల కుప్పగా మార్చాడని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులను కేసీఆర్​ అవమానిస్తున్నాడని విమర్శించారు. ఉద్యమకారుడు నాగరాజు రెండు కాళ్లు, చేయి లేని స్థితిలో దుర్భర జీవితం గడుపుతుంటే  పట్టించుకోవడం లేదన్నారు. ‘ఉద్యమంలో ఎప్పుడైనా కేసీఆర్​ జైలు కెళ్లాడా? ఆయన కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? లాఠీ దెబ్బలు తిన్నారా? ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకనట్టు నాటకమాడే ఫ్యామిలీ కేసీఆర్​ది’ అని విమర్శించారు. ప్రాణత్యాగాలు ఒకరు చేస్తే  ఫలితాలను మరొకరు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. 1,200 మంది చనిపోతే అందులో సగం మందివి బలిదానాలే కావని కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఉద్యమకారుల తరఫున కాంగ్రెస్, బీజేపీ కూడా నిలబడడం లేదన్నారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ మేఘా కృష్ణారెడ్డికే కట్టబెడుతున్నా అడిగే వాళ్లు లేరన్నారు. రాష్ట్రంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, సమస్యలను ఎత్తి చూపడానికే పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. కేవలం రైతు బంధు మాత్రమే ఇస్తూ మిగతా పథకాలన్నింటినీ ఎగనామం పెట్టారని విమర్శించారు. ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేన్లు లేవని, సంక్షేమాన్ని సర్కారు పక్కన పెట్టిందని విమర్శించారు. ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వైఎస్సార్​టీపీతోనే  సాధ్యమని అన్నారు.