ధరణి పోర్టల్ను ఆసరాగా కేసీఆర్ భూకబ్జాలు: షర్మిల

ధరణి పోర్టల్ను ఆసరాగా కేసీఆర్ భూకబ్జాలు: షర్మిల

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/రేగొండ, వెలుగు: ధరణి.. ఓ బోగస్ పోర్టల్ అని, అది సీఎం కేసీఆర్ కుటుంబం భూకబ్జాలు చేయడానికి పనికొచ్చే వెబ్ సైట్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘‘ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ తో పేద రైతులకు ఒరిగిందేమీ లేదు. ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో రెండెకరాల భూమి ఉన్న వాళ్లకు ఎకరం భూమి ఉన్నట్లు చూపిస్తోంది. ఎకరం ఉన్న వాళ్లకు అసలు భూమే లేదన్నట్లుగా చూపిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని రాత్రికి రాత్రి భూ కబ్జాలకు తెరలేపుతున్నారు” అని అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, గణపురం మండలాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. గణపురం మండల కేంద్రంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని రైతులందరూ అప్పుల పాలయ్యారు. కేసీఆర్‌‌ పంట రుణాలను మాఫీ చేయకపోవడంతో రైతులంతా డీఫాల్టర్స్ గా మారారు. పంట పొలాల్లో బ్యాంకర్లు ఎర్ర జెండాలు పాతుతున్నారు. రైతుబంధు కింద ముష్టి రూ.5 వేలు ఇస్తూ రైతులను కోటీశ్వరులను చేశామని కేసీఆర్ గొప్పలు చెబుతున్నారు. కానీ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పండించిన వడ్లు కొనడం లేదు. రుణమాఫీ చేయడం లేదు. ఆయన గొప్పలు చెప్పడం తప్ప.. రైతులకు చేసిన మేలేమీ లేదు” అని మండిపడ్డారు.  

కేసీఆర్.. ఓ 420

ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని షర్మిల అన్నారు. కేసీఆర్.. ఓ 420, చీటర్‌‌‌‌ అని విమర్శించారు. ఒకప్పుడు స్కూటర్‌‌‌‌ పై తిరిగిన కేసీఆర్ ఇప్పుడు విమానాలు, హెలికాప్టర్లు ఎలా కొంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక.. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారని  విమర్శించారు. ‘‘కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి.. బార్ల తెలంగాణగా మార్చిండు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది.” అని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. దళిత బంధు స్కీమ్ టీఆర్ఎస్ అనుచరుల బంధుగా మారిందని విమర్శించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.