కేసీఆర్ కేబినెట్ లో అవినీతి మంత్రులు

కేసీఆర్ కేబినెట్ లో అవినీతి మంత్రులు

భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: సీఎం కేసీఆర్​ కేబినెట్​లో 10 మంది మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. దమ్మపేటలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘టీఆర్​ఎస్​ పార్టీ బీఆర్​ఎస్​లా మారింది. బీఆర్​ఎస్​ అంటే బార్​ అండ్​ రెస్టారెంట్​ సమితి అని సోషల్​ మీడియాలో ప్రజలు జోకులు వేసుకునే దుస్థితి టీఆర్​ఎస్​కు దక్కింది’’ అని విమర్శించారు. టీఆర్​ఎస్​ గవర్నమెంట్​ పోలీసులను పనోళ్లుగా వాడుకుంటున్నదని మండిపడ్డారు. కేసీఆర్​ సిగ్గులేకుండా ప్లీనరీ పెట్టుకొని, అభినందన తీర్మానం పెట్టుకున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్​ చెప్పిన మాటకు రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట వేయలేదని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంలో చలనం రావడం లేదన్నారు. 

ధరణి పేరిట భారీ అవినీతి

ధరణి పోర్టల్​ పేరిట భారీ ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. ఇప్పుడేమో ధరణి  కరెక్షన్​ పేరుతో రైతుల వద్ద నుంచి అప్లికేషన్​ ఫీజు పేరిట పెద్ద ఎత్తున దోచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ‘‘కేసీఆర్​ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారే తప్ప.. ఆయనపై ఎందుకు కేసులు పెట్టడం లేదు. కేసీఆర్​ ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించి అవినీతి 
ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టాలి” అని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే స్వార్థ రాజకీయం కోసం సిగ్గు లేకుండా టీఆర్​ఎస్ పార్టీలో చేరారని ఆమె విమర్శించారు. గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా కల్పించని ఎమ్మెల్యే ఉండి ఎందుకని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేను నిలదీయాలని జనానికి పిలుపునిచ్చారు. ఈ ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నారని, గెస్ట్​హౌస్​లు కట్టుకుని బోగాలు అనుభవిస్తున్నారని 
ఆరోపించారు