సీఎం ఉన్నా లేనట్లే : షర్మిల

సీఎం ఉన్నా లేనట్లే : షర్మిల
  • వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలి
  • వీఆర్​ఏలకు వెంటనే పే స్కేల్​అమలు చేయాలి: షర్మిల

మంచిర్యాల/దండేపల్లి, వెలుగు : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ర్టానికి సీఎం ఉన్నా లేనట్లేనని వైఎస్సార్ టీపీ చీఫ్​షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడెంలో పోడు భూముల కోసం పోరాడుతున్న ఆదివాసీలను, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వరద బాధితులను ఆమె గురువారం పరామర్శించారు. అలాగే కలెక్టరేట్​వద్ద వీఆర్ఏల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్​ ఎనిమిదేండ్లుగా ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫారెస్ట్​ అధికారులు కోయపోశగూడెం ఆదివాసీ మహిళలపై అక్రమ కేసులు పెట్టి, బట్టలు ఊడేదాకా కొట్టి, 12 మందిని జైలుకు పంపడం అత్యంత పాశవికమన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్​ చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్​నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, మేదరివాడలోని ముంపు బాధితులను ఆమె పరామర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదను అధికారులు అంచనా వేయలేకపోయారని, కాళేశ్వరం బ్యాక్​వాటర్​వల్లే కాలనీలు, పంటలు నీటమునిగాయన్నారు. ముంపు బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందించాలని, వరదల కారణంగా జరిగిన పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్​ చేశారు. బాలాజీనగర్​లో ఇల్లు నీట మునగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ది జమున కుటుంబాన్ని షర్మిల పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. వీఆర్ఏల ధర్నా శిబిరం వద్ద మాట్లాడుతూ వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్, జాబ్ చార్ట్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు.