హుజురాబాద్‌లో పోటీకి రెడీ.. నా కండిషన్స్ ఇవే

హుజురాబాద్‌లో పోటీకి రెడీ.. నా కండిషన్స్ ఇవే

హైదరాబాద్: తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ ఓ దొరలా పాలిస్తున్నాడని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఈ రోజు లోటస్ పాండ్‌లోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనా ఆమె కామెంట్ చేశారు. ‘‘హుజురాబాద్ ఎన్నికల వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం” అని అన్నారు.

కేసీఆర్‌లోని దొర బయటపడుతున్నాడు
‘‘ఉద్యమకారుడిగా కేసీఆర్ అంటే అభిమానం ఉండేది. మంచి చేస్తారనే భావించా. కానీ ఇప్పుడు ఆయనలోని దొర బయటపడుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి సామాన్యులకు సైతం అనుమతి ఉండేది. మంత్రులు, ప్రజాప్రతినిధులైతే నేరుగా సీఎం ఆఫీస్‌కి వెళ్లే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు గేట్ బయట నిలబడి బిక్షం ఎత్తుకుంటున్నారు. మేం నిరాహార దీక్షలు చేస్తేనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా.. కేవలం 50 వేల పోస్టులు భర్తీ చేస్తామనడంలో అర్థం ఉందా? సీఎం కేసీఆర్ 52 వేల కాంట్రాక్టు ఉద్యోగులని తొలగించారు. వారిపక్షాన పోరాటం చేస్తాం. వైఎస్ఆర్‌లాగే నేను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర చేస్తా. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే మేమెందుకు పాదయాత్ర చేస్తాం? పెట్రోల్ తెచ్చుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్ట తెచ్చుకోవడం తెలియదా? మీరు రెచ్చగొడితేనే కదా యువత ఆత్మహత్యలు చేసుకుంది. తెలంగాణ కట్టుబొట్టు అన్ని నాకు తెలుసు. నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను. తెలంగాణ సంప్రదాయాల గురించి నాకు అన్నీ తెలుసు. జగన్, నేను రెండు వేరువేరు ప్రాంతాలకు ప్రతినిధులం. మేం మతాలకు, కులాలకు అతీతం. నాకు మతాన్ని, కులాన్ని ఆపాదించొద్దు. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని మాత్రమే. ఎవరో వదిలిన బాణం కాదు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. కేసీఆర్ కనీసం 5 శాతానికి కూడా పెంచలేకపోయాడు. మైనారిటీల అభ్యున్నతికి వైఎస్ చేయనిది లేదు. నేను మైనారిటీల కోసం వైఎస్ కంటే ఎక్కువే చేసి చూపిస్తా’’ అని షర్మిల అన్నారు.