ప్రజల పక్షాన నిలబడ్డ..ప్రతి అంశంపై పోరాడుతా

ప్రజల పక్షాన నిలబడ్డ..ప్రతి అంశంపై పోరాడుతా

కేసీఆర్ పాలన లో ఏ వర్గం బాగుపడలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికలప్పుడే బయటకు వస్తాడని.. ఓట్లు వేయించుకొని మళ్లీ ఫామ్హౌజ్ కు వెళ్తాడని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, పోడు భూములు అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఅర్ పాలనలో కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు మూడింతలు పెరిగాయని..పేదవాడి రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ లో చలనం లేదన్నారు. 

రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడంలేదని వైఎస్ షర్మిల అన్నారు. హాస్టళ్లలో పేద పిల్లలు కప్పలు పడిన భోజనం తింటున్నారని.. కేసీఆర్ మనవడు కూడా ఇదే భోజనం తింటున్నాడా అని ప్రశ్నించారు. ఒక మంత్రిని రోడ్డు వేయమని అడిగితే.. ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయని అడగడం సిగ్గుచేటన్నారు. ఓట్లు ఉంటేనే గ్రామాలకు రోడ్లు వేస్తారా అని నిలదీశారు. ఇదేనా బంగారు తెలంగాణ అని అడిగారు.

ప్రజల పక్షాన తాను నిలబడ్డానని.. ప్రతి అంశంపై పోరాటం చేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. సమస్యలే లేవని పాలకపక్షం చెప్తోంది.. సమస్యలు ఉన్నాయని ఎత్తిచూపిస్తూ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ అరాచకాలను ప్రతిపక్షాలు పట్టించుకోలేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాయని ఆరోపించారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే పార్టీ పెట్టానని.. వైఎస్సార్ ప్రతి పథకాన్ని బ్రహ్మండంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు.