ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు

ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు
  • ప్రతిపక్షాలను బూతులు తిట్టడంలో ఆయన పీహెచ్ డీ చేశారు.
  • వైఎస్ ఆర్టీపీ నేత గట్టు రాంచందర్ రావు ధ్యజం
  • టీఆర్ఎస్ లో పనికి వచ్చే వారు ఎవరైనా ఉన్నారా?

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం, వారిని అడ్డుకోవడం వంటివి పరిచయం చేసిందే సీఎం కేసీఆర్ అని వైఎస్ఆర్ టీపీ నేత గట్టు రాంచందర్ రావు అన్నారు. ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడంలో కేసీఆర్  పీహెచ్ డీ చేశారని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారని, షర్మిల అరెస్టును రాష్ట్ర ప్రజలంతా గమనించారని అన్నారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత పనికొచ్చే వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తమను కిరాయి మనుషులు, పరాయి వ్యక్తులు అంటున్న వారు.. తెలంగాణ ప్రజల కోసం పెట్టిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారని నిలదీశారు. ‘‘మీరు మమ్మల్ని అడ్డుకున్నట్లు టీఆర్ఎస్ పెట్టిన ప్రారంభంలో, ఉద్యమ టైమ్ లో ఇతరులు అడ్డుకుంటే ఇవ్వాళ మీరు తిరిగేవారా?  టీఆర్ఎస్ లో ఉన్న నేతలే కేసీఆర్ ను తిట్టించే పని పెట్టుకున్నారు. షర్మిల పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోరా? మీ దాడులకు మేము భయపడం” అని గట్టు వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తో అన్ని వర్గాల వారికీ ఇబ్బందులు: కవిత

కేసీఆర్ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ ఆర్టీపీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు గడిపల్లి కవిత అన్నారు. బుధవారం లోటస్ పాండ్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్  మహిళా ఎమ్మెల్యేలు షర్మిలపై విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యలపై ఎన్నడైనా కేసీఆర్ ను వారు ప్రశ్నించారా అని ఆమె నిలదీశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని గిరిజనులు, దళితులను సీఎం మోసం చేశారని ఆమె ఫైరయ్యారు. తెలంగాణ సంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్  బూతులు మాట్లాడుతున్నాడని, మహిళలను కూడా గౌరవించరని పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి విమర్శించారు.