షర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణం: గట్టు రామచంద్రరావు

షర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణం: గట్టు రామచంద్రరావు

షర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణం అని వైఎస్ఆర్టీపీ నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. గవర్నర్ కూడా ట్విట్టర్ లో షర్మిలపై జరిగిన దాడిని ఖండించారంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోందన్నారు. ఇలాంటి దాడులకు తాము భయపడమన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు. అవసరమైతే లీగల్ గా పోరాటానికి కూడా సిద్ధమన్నారు. షర్మిలకు ఉత్తర తెలంగాణలో పెద్దగా ఆదరణ ఉండదు అని అనుకున్నారు. కానీ భారీగా స్పందన రావడంతో రాష్ట్రమంతా ఇదే పరిస్థితి వస్తే ఇబ్బంది అవుతుందని భావించే ఈ దాడులు చేశారని చెప్పారు. 

టీఆర్ఎస్ లో ఉద్యమకారులు ఎంత మంది ఉన్నారు? ఉద్యమకారులను బయటకు గెంటేసి... ఉద్యమం గురించి మాట్లాడుతున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. షర్మిల పాదయాత్ర చేస్తే ఏం జరిగినా తమకు సంబంధం లేదని అంటున్నారు. అంటే హెచ్చరిస్తున్నారా? కాపాడలేని వారికి అధికారం ఎందుకు? అని ప్రశ్నించారు. హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చిందని..న్యాయస్థానం  ఆదేశాలు కూడా పట్టించుకోరా అని నిలదీశారు. షర్మిల కారులో ఉండగానే టోయింగ్ చేసి తీసుకెళ్లి రాక్షసనందం పొందారని అన్నారు. బిడ్డను చూసేందుకు తల్లి విజయమ్మ వెళ్తే అడ్డుకున్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎందరో నియంతలు రాజ్యమేలారు..చివరకు వారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు అన్నారు.  పోలీసులు దాడి జరిగే అవకాశం ఉందని చెప్పారు. వారికి ఎవరు దాడి చేస్తారో కూడా తెలుసు. అయినా వారిని అడ్డుకోకుండా మమ్మల్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యారవాన్ ను తగలబెట్టి వాహనాలు ధ్వంసం చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్లు దోచుకున్నారు అది నిజం కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావును ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో సమాధానం చెప్పాలన్నారు. చేసిన తప్పులు బయటపడతాయనే ఆయన్ను తొలగించింది నిజం కాదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల కోసం ఉన్న ఏకైక పార్టీ YSRTP అన్నారు. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పనికొచ్చేవారు ఒక్కరైనా ఉన్నారా? ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా కాలనీలు నిర్మిస్తామన్నారు. టీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అడ్డుకున్నట్లు టీఆర్ ఎస్ పెట్టిన ప్రారంభంలో ఇతరులు అడ్డుకుంటే ఇవ్వాళ మీరు తిరిగేవారా? అని ప్రశ్నించారు. ఆరోజే మిమ్మల్ని నల్లిని నలిపినట్లు నలిపేస్తే ఇవ్వాళ అధికారంలోకి వచ్చేవారా అని నిలదీశారు.