జనవరి 4న కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీనం!

జనవరి 4న కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీనం!

హైదరాబాద్, వెలుగు:  వైఎస్సార్టీపీని కాంగ్రెస్​లో విలీనం చేసే ముహూర్తం ఖరారైంది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని వైఎస్​షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో సమావేశమై విలీనంపై చర్చించారు. మీటింగ్ తర్వాత మీడియా ప్రశ్నలకు షర్మిల సమాధానం ఇచ్చారు.

తనకు మద్దతిస్తున్నందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పార్టీ విలీనం, ఏపీ పీసీసీ చీఫ్ ఇస్తున్నారా అన్న ప్రశ్నలకు రెండు రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తామని షర్మిల ప్రకటించారు. మీటింగ్ తర్వాత పార్టీ నేతలు తూడి దేవేందర్ రెడ్డి, పిట్టా రాంరెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో విలీనం చేస్తున్నామని ఏఐసీసీ నుంచి ఏపీ పీసీసీ చీఫ్ లేదా రాజ్యసభ హామీ వచ్చిందని నేతలు తెలిపారు. షర్మిల రాక కోసం ఏపీ ప్రజలు, కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ లో చేరాలని అడిగారు: వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చామని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్టీపీ మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గరకు వెళ్లిన ఆమె.. తల్లి విజయమ్మ, కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి, కూతురు అంజలితో కలిసి నివాళులు అర్పించారు. 

వచ్చే నెలలో రాజారెడ్డి వివాహం సందర్భంగా పెళ్లి కార్డ్ ను వైఎస్సార్​ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 31 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు10 వేల ఓట్ల తేడాతో గెలిచారని, ఇందుకు మేం పోటీ చేయకపోవటమే కారణం అని షర్మిల తెలిపారు. మా త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, తమ పార్టీలో చేరాలని అడిగారని ఆమె చెప్పారు.