ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు : షర్మిల

ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు : షర్మిల

తెలంగాణ ఖజానాను సీఎం కేసీఆర్ పూర్తిగా కొల్లగొట్టారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ఆరోపించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తేనే ఓట్ల కోసం ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని తెలిపారు. ప్రాజెక్ట్ ల పేరుతో కమీషన్ల రూపంలో రాష్ట్ర సంపదను దోచేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ ను మళ్ళీ నమ్మితే తెలంగాణ ను అమ్మేస్తారని.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఅర్ కి అసలు పరిపాలన చేతకాదని..ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు కోటీశ్వరులు అయితే.. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ లో కనీసం హాస్టళ్లలో విద్యార్థులకు మంచి భోజనంపెట్టే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరు కూడా మెదపడం లేదని.. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి సీఎం కేసీఆర్ అవినీతి చేస్తుంటే...బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రశ్నించలేదన్నారు. అన్ని ప్రాజెక్ట్ లు మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఎందుకు అప్పగిస్తున్నారనే విషయాన్ని అడగలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.3 వేలకు పైగా పెన్షన్లు, ప్రతి పేద మహిళ పేరు మీద పక్కా ఇళ్లు, భారీగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాల కల్పన మీదే తన మొదటి సంతకం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం యాత్ర నిర్మల్ జిల్లా మామడలకు చేరుకోవడంతో వైఎస్ షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.