నింగి నుంచి నేలకు..యువీ ఒక్కడే

నింగి నుంచి నేలకు..యువీ ఒక్కడే

స్టయిలిష్‌‌ ఆటతో పరిమిత ఓవర్ల క్రికెట్‌‌ను కొత్త పుంతలు తొక్కించి.. మైదానం లోపలా.. బయట ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని.. కేన్సర్‌‌ను జయించి.. పనైపోయిందన్నప్పుడల్లా ఫీనిక్స్‌‌లా పైకిలేచిన యువరాజ్‌‌ క్రికెట్‌‌కు సెలవిచ్చాడు. అసమాన ఆటతో అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిన యువీ అస్త్రసన్యాసం తీసుకున్నాడు. అలసిపోయాను గానీ ఆగిపోను అంటున్న యువీ నిజంగా వీరుడే..!

‘కేన్సర్‌‌ సోకిందని తెలిసిన వెంటనే  ఎవరైనా బతుకుతామా లేదా అనుకుంటారు.  కానీ, నేను మాత్రం కేన్సర్‌‌ వచ్చిందని తెలియగానే మళ్లీ ఇండియాకు ఆడతానా లేదా అనుకున్నా’  యువరాజ్‌‌ చెప్పిన ఈ ఒక్క మాట చాలు క్రికెట్‌‌పై అతనికి ఎంత  ప్రేమ, ప్యాషన్‌‌ ఎలాంటిదో చెప్పేందుకు.  ఇండియా క్రికెట్‌‌పై అతను వేసిన ముద్ర కూడా అలాంటిదే. లిమిటెడ్‌‌ ఓవర్ల క్రికెట్‌‌లో  దేశం అందించిన  గ్రేటెస్ట్‌‌ ప్లేయర్లలో యువీ ఒకడు. నిఖార్సైన మ్యాచ్‌‌ విన్నర్‌‌గా…  ఇండియాకు రెండు వరల్డ్‌‌కప్స్‌‌ అందించిన వీరుడిగా అతను  దేశ క్రికెట్‌‌లో చిరకాలం గుర్తుండిపోతాడు.  పదిహేడేళ్ల సుదీర్ఘ కెరీర్‌‌లో  మైదానం ప్రత్యర్థులతో.. అవతల అంతకంటే పెద్ద శత్రువుతో పోరాడి గెలిచి.. ఎత్తుపల్లాలు ఎన్నో చూసి.. కష్టాలు ఎన్ని ఎదురైనా తట్టుకొని నిలబడ్డాడు.

నాన్న కల కోసం క్రికెట్‌‌.. వస్తూనే ఉప్పెనలా..  

క్రికెటర్‌‌గా తాను అందుకోలేని లక్ష్యాలను యువీ తండ్రి యోగ్‌‌రాజ్‌‌ తన కొడుకు ద్వారా తీర్చుకోవాలన్న ఆలోచన ఇండియా క్రికెట్‌‌కు ఓ ఆణిముత్యాన్ని అందించింది. చిన్నప్పుడు రోలర్‌‌ స్కేటింగ్‌‌ను ఎంతో ఇష్టపడినా.. క్రికెట్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకున్న యువీ 18 ఏళ్ల వయసులోనే నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌‌లోనే తన రాకను ప్రపంచానికి ఘనంగా చాటుకున్నాడు. 2000 సంవత్సరంలో చాంపియన్స్‌‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లోనే.. మెక్‌‌గ్రాత్‌‌, బ్రెట్‌‌లీ, గిల్లెస్పీ వంటి భయంకర బౌలర్లను ఎదుర్కొని 80 బంతుల్లో 84 రన్స్‌‌ చేశాడు. ఆరంభంలోనే వచ్చిన స్టార్‌‌డమ్‌‌, ఫిట్‌‌నెస్‌‌, కమిట్‌‌మెంట్‌‌ సమస్యలతో  కాస్త తడబడినా.. రెండేళ్లలోనే జట్టులో తన ప్లేస్‌‌ను సుస్థిరం చేసుకున్నాడు. 2002 నాట్‌‌వెస్ట్‌‌ సిరీస్‌‌ ఫైనల్లో మహ్మద్‌‌ కైఫ్‌‌తో ఆడిన ఇన్నింగ్స్‌‌ అతని కెరీర్‌‌కు బంగారు బాట వేసింది. మిడిలార్డర్‌‌లో పాతుకుపోయిన యువీ, చురుకైన ఫీల్డింగ్‌‌, లెఫ్టార్మ్‌‌ స్పిన్‌‌తో వన్డే క్రికెట్‌‌లో ఇండియాకు కావాల్సిన కంప్లీట్‌‌ ప్యాకేజ్‌‌గా మారిపోయాడు. 2003 వరల్డ్‌‌కప్‌‌లో ఆడే చాన్స్‌‌ కొట్టేసిన అతను తర్వాత  మిడిలార్డర్‌‌కు మూలస్తంభంగా మారిపోయాడు. ధోనీతో కలిసి ఎన్నో మ్యాచ్‌‌ల్లో జట్టును గెలిపించాడు.  2007 వరల్డ్‌‌ టీ20లో  స్టువర్ట్‌‌ బ్రాడ్‌‌ బౌలింగ్‌‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో  యువరాజ్‌‌ స్టార్‌‌డమ్‌‌ అమాంతం పెరిగింది.

నింగి నుంచి నేలకు..

యువరాజ్‌‌ జీవితాన్ని పరిశీలిస్తే….  ‘నిప్పులు చిమ్ముతు నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరే.. నెత్తురు కక్కుతు నేలను నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే..’ అన్న శ్రీశ్రీ మాటను గుర్తుకు తెస్తున్నది. కెరీర్‌‌ స్వింగ్‌‌లో ఉన్నప్పుడు  ఆకాశమే హద్దుగా చెలరేగే అతని ఆటను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 2011 వరల్డ్‌‌కప్‌‌లో అయితే అతనిది వన్‌‌ మ్యాన్‌‌ షో. 1983లో కపిల్‌‌ ఇండియాను గెలిపించినట్టు.. 300 ప్లస్‌‌ రన్స్‌‌, 15 వికెట్లతో ఆల్‌‌రౌండర్‌‌గా అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసిన యువీ.. ఇండియా రెండోసారి వరల్డ్‌‌కప్‌‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఆ టోర్నీ  తర్వాత యువీ జీవితం అనూహ్య మలుపు తిరిగింది. టోర్నీ ముగిశాక కేన్సర్‌‌ వచ్చిందని తేలడంతో నింగి నుంచి నేలకు పడినట్టు అయింది అతని పరిస్థితి. కెరీర్‌‌ పీక్‌‌ స్టేజ్‌‌లో ఉండగా ఏర్పడిన అనుకోని అగాథంతో అతనేమీ కుంగిపోలేదు. ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకొని  మళ్లీ మైదానంలోకి వచ్చాడు. తిరిగి జట్టులో చోటు దక్కించుకుని రియల్‌‌ హీరోగా మారాడు. కానీ, కేన్సర్‌‌తో పోరాటంలో గెలిచినప్పటికీ అతను మునుపటి టచ్‌‌ను కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా.. గతంలో మాదిరిగా ఆడలేకపోయాడు. 2014 వరల్డ్‌‌ టీ20 ఫైనల్లో సింగిల్స్‌‌ కూడా తీయలేకపోయిన అతని పరిస్థితి జాలి కలిగించింది. ఆ మ్యాచ్‌‌ తర్వాత మూడేళ్లు  కూడా దూరం కావాల్సి వచ్చింది. ఫిట్‌‌నెస్‌‌ను మెరుగు పరుచుకుని..  దేశవాళీ క్రికెట్‌‌లో సత్తా చాటి 2017లో మళ్లీ జట్టులోకి వచ్చాడు. కానీ,. రెండు మూడు మంచి ఇన్నింగ్స్‌‌లు ఆడినప్పటికీ నిలకడ లేకపోడంతో యువరాజ్‌‌ కెరీర్‌‌ ప్రశ్నార్థకమైంది. చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్‌‌ యువీతో పాటు మరికొందరు సీనియర్లపై వేటు పడింది. కొత్త ప్లేయర్లతో పోటీలో యువీ   వెనకబడ్డాడు. ఐపీఎల్‌‌లో కూడా ఆకట్టుకోలేపోయాడు. ఒక టైమ్‌‌లో16 కోట్ల భారీ రేటు పలికి.. కోటి రూపాయలు ఇచ్చేందుకు కూడా ఫ్రాంచైజీలు ఆలోచించే పరిస్థితి రావడంతో  కెరీర్‌‌కు ముగింపు పలకడమే ఉత్తమం అని భావించాడు.

టెస్ట్‌‌లో హిట్టవలేకపోయాడు

జీవితంలో ఎన్నోసార్లు పోరాడి గెలిచిన యువరాజ్‌‌ టెస్ట్‌‌  క్రికెట్‌‌లో మాత్రం హిట్‌‌ కాలేకపోయాడు. నీలి రంగు జెర్సీ వేసుకోగానే చెలరేగిపోయే యువీ.. వైట్‌‌ డ్రెస్‌‌లో మాత్రం నిలకడ చూపలేకపోయాడు. ఆస్ట్రేలియా గ్రేట్‌‌ మైకేల్‌‌ బేవాన్‌‌  మాదిరిగా వన్డేల్లో అద్భుతమైన కెరీర్‌‌ ఉన్న యువీ.. రెడ్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌లో తడబడ్డాడు. దేశవాళీల్లో మారథాన్‌‌ ఇన్నింగ్స్‌‌లు చాలా ఆడినా.. అదే జోరును, నిలకడను అత్యుత్తమ ఫార్మాట్‌‌లో చూపలేకపోయాడు. అయితే, మిడిలార్డర్‌‌ స్థానంలో  గంగూలీతో పోటీ వల్ల కూడా యువీ వెనకబడిపోయాడు. ఏ నంబర్‌‌లో ఆడాలో తేల్చుకోలేక కొంతకాలం ఇబ్బంది పడిన అతను.. తీరా కుదురుకునే టైమ్‌‌లో కేన్సర్‌‌ బారిన పడడంతో మైదానం అవతల పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక, స్లో వికెట్లపై.. స్లో బౌలర్లను ఎదుర్కోవడంలో యువీ తడబడేవాడు. ముత్తయ్య మురళీధరన్‌‌ బౌలింగ్‌‌లో అతనెప్పుడూ ధాటిగా ఆడలేకపోయాడు. ఇలాంటి టెక్నికల్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఉన్నా కూడా యువరాజ్‌‌ 300పైచిలుకు వన్డేలు ఆడగలిగాడు.  టెస్ట్‌‌ల్లో హిట్‌‌ కాకపోయినా.. బ్యాటింగ్‌‌లో కొన్ని లోపాలు ఉన్నా.. యువరాజ్‌‌ యువరాజే. అతనిలాంటి మరో ఆటగాడు ఇప్పటికైతే లేడు. ఇండియా గ్రేటెస్ట్‌‌ వన్డే ప్లేయర్లలో ఒకటిగా యువరాజ్‌‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

ఎంత ఇష్టమో.. అంత అయిష్టం..

క్రికెట్‌ అంటే తనకు ఎంత ఇష్టమో.. అంతే అయిష్టం కూడా ఉండేదని యువరాజ్‌ అన్నాడు. ‘క్రికెట్‌తో నాకు లవ్​–హేట్​ రిలేషన్‌షిప్‌ ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే దీని అర్థం కూడా నాకు తెలియదు. ఎలా పోరాడాలో, ఎలా ఓడిపోవాలో ఈ ఆటే నేర్పింది. నా చివరి శ్వాస వరకు కూడా వదిలిపెట్టను. క్రికెట్ నాకు నేర్పింది అదే. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు నా రక్తం, చెమట చిందించా. 2011 వరల్డ్‌కప్‌ గెలువడం ఓ కల. కానీ క్యాన్సర్‌తో అంతా తలకిందులైంది. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. అత్యుత్తమ ఫామ్‌తో ఆకాశంలో ఉన్న నేను తక్కువ స్పీడ్‌తోనే నేలకు పడినా.. దెబ్బ మాత్రం బలంగా తాకింది. ఈ కష్టకాలంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన మద్దతు మర్చిపోలేను’ అని యువీ చెప్పుకొచ్చాడు.

ఫేర్‌‌వెల్‌‌ వద్దన్నా..!

ఒకవేళ యోయో టెస్ట్‌‌ పాస్‌‌ కాకపోతే.. ఫేర్‌‌వెల్‌‌ మ్యాచ్‌‌ ఏర్పాటు చేస్తామని ఓ సందర్భంలో బీసీసీఐ చెప్పిందని యువరాజ్‌‌ వెల్లడించాడు. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నాడు. ‘నాకు ఇదే చివరి మ్యాచ్‌‌ అని బీసీసీఐలో ఎవరూ చెప్పలేదు. నాలో సత్తా లేకపోతే, ఫామ్‌‌ లేకపోతే నేనే రిటైర్మెంట్‌‌ తీసుకుంటా. కానీ నాకు చివరి మ్యాచ్‌‌లో ఆడే అవకాశం ఇవ్వండని నేను ఎవర్ని అడగలేదు. అలా అడిగి ఆడటం నాకు ఇష్టం లేదు. ఆ తరహా దృక్పథంతో నేను క్రికెట్‌‌ ఆడలేదు. యో యో పాస్‌‌ కాకపోతే మరో ఆలోచన లేకుండా ఇంటికి వెళ్లిపోతానని చెప్పా. రిటైర్మెంట్‌‌ మ్యాచ్‌‌ నాకు అవసరం లేదని చెప్పా’ అని ఈ లెఫ్టాండర్‌‌ తెలిపాడు. మిగతా విషయాలన్నింటి గురించి టైమ్‌‌ వచ్చినప్పుడు మాట్లాడదామని   పేర్కొన్నాడు.