
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక.. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఫిట్‌నెస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని సెలెక్టర్లు చెప్పడం చాలా తప్పన్నాడు. సారథ్యం నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను సెలెక్టర్లు పరిశీలిస్తే బాగుండేదన్నాడు. ‘సెలెక్టర్లు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. భావోద్వేగంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా టెస్ట్ కెప్టెన్‌ను ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని నియమించకూడదు. ఎందుకంటే రోహిత్ చాలాసార్లు గాయపడ్డాడు. అతని వయసు కూడా ఎక్కువే. ఆ వయసులో సహజంగానే గాయాలవుతాయి. ఇవన్నీ అతని టెస్ట్ కెప్టెన్సీపై ఒత్తిడిని పెంచుతాయి. రెండేళ్ల ముందు నుంచే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెడితే బాగుండేది. ఐదు రోజుల పాటు గ్రౌండ్‌లో నిలబడటం అంటే అంత ఈజీ కాదు’ అని యువీ పేర్కొన్నాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్‌లో రోహిత్‌కు ఎప్పుడో సారథ్యం అప్పగించాల్సిందన్నాడు. విరాట్ రాణిస్తుండటం వల్ల ఆలస్యమైందని చెప్పాడు. శనివారం 35వ పడిలోకి అడుగుపెట్టిన రోహిత్.. గత రెండేళ్లలో చాలా గాయాల బారిన పడ్డాడు.