షర్మిల కాదు.. ఎవరొచ్చినా ఏమీ చేయలేరు : వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కాదు.. ఎవరొచ్చినా ఏమీ చేయలేరు : వైవీ సుబ్బారెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరన్నారు.  పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి వైఎస్ షర్మిల వచ్చింది ఈరోజేనని..  రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో ఒకసారి చూసి మాట్లాడాలని అన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు వేసి, బిల్డింగ్ లు కట్టడం కాదని ఆయన చురకలు అంటించారు. 

తాను ఛాలెంజ్ చేస్తున్నా.. రమ్మనండి..  మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని సవాల్ విసిరారు.  రాష్ట్రంలో పేదలకు ఏ ఇబ్బందులు లేకుండా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని.. ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అరోపణలనే షర్మిల చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో రాజకీయాలు చేసి.. ఇప్పుడు ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన పార్టీని విలీనం చేసి.. ఆమె కూడా చేరిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ కు ఉనికే లేకుండా పోయింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు.. షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించారు.