FIFA World Cup 2026: భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) అదిరిపోయే తీపి కబురు అందించింది. సుదీర్ఘ చర్చల తర్వాత ప్రముఖ మీడియా నెట్‌వర్క్ 'జీ' (Zee) ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసార హక్కులను అధికారికంగా దక్కించుకుంది. ఈ మేరకు ఫిఫాతో జీ మల్టీ-ఇయర్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, 2026 నుంచి 2034 వరకు జరగబోయే మొత్తం 39 ఫిఫా టోర్నమెంట్లు, వరల్డ్ కప్‌లను భారత్‌లో ప్రసారం చేసే హక్కులు జీ నెట్‌వర్క్‌కే సొంతమయ్యాయి. ఇటీవలే 7 సరికొత్త స్పోర్ట్స్ ఛానళ్లను లాంచ్ చేసిన జీ సంస్థకు, ఈ మెగా డీల్ దక్కడం భారత క్రీడారంగంలో ఒక సంచలనంగా మారింది.
ఫ్యాన్స్‌ను ఆదుకున్న జీ:
అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జూన్ 11న ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభం కావడానికి కేవలం 10 రోజుల ముందు ఈ డీల్ కుదరడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రసార హక్కులు అమ్ముడుపోయినా, ఇండియాలో మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. జియోహాట్‌స్టార్ (JioHotstar) కేవలం $20 మిలియన్ల వాల్యుయేషన్‌కే పట్టుబట్టడంతో రేసు నుంచి తప్పుకుంది. దీంతో స్పోర్ట్స్ రంగంలోకి దిగిన జీ నెట్‌వర్క్, ఫిఫాతో ఒంటరిగా చర్చలు జరిపి 2034 వరకు సుదీర్ఘ ఒప్పందాన్ని ఫిక్స్ చేసుకుంది. గతంలో ఫిఫా హక్కులను $60 మిలియన్లకు కొనుగోలు చేసిన జియోహాట్‌స్టార్, అందులో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. ఈసారి ఫిఫా మొదట $100 మిలియన్లు డిమాండ్ చేసినప్పటికీ, చివరికి రేటు తగ్గించింది. జీ సంస్థ సుమారు $35 మిలియన్లకే బిడ్ వేసినట్లు తెలుస్తోంది.
భారత్ లో ఫిఫా వరల్డ్ కప్ లైవ్ ఎక్కడ చూడాలి?:
భారత కాలమానం ప్రకారం 90 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌లు అర్ధరాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల మధ్య జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లను భారత్‌లో ఈ క్రింది ప్లాట్‌ఫారమ్‌లలో చూడోచ్చు..
* టీవీ ప్రసారాలు: జీ నెట్‌వర్క్‌కు చెందిన సరికొత్త స్పోర్ట్స్ ఛానల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
* లైవ్ స్ట్రీమింగ్: జీ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ5' (Zee5) యాప్, వెబ్‌సైట్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడవచ్చు.
