మేం బాధితులం కాదు.. ఫైటర్లం : జెలెన్ స్కీ

మేం బాధితులం కాదు.. ఫైటర్లం : జెలెన్ స్కీ
  • ఫ్రీడమ్ కోసం పోరు కొనసాగిస్తాం: జెలెన్ స్కీ 

కీవ్/మాస్కో:  స్వాతంత్ర్యం కోసం తాము పోరాడుతున్నామని, ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ బాధిత దేశం కాదని.. ఫైటర్ కంట్రీ అని అభివర్ణించారు. ‘‘మాకు శాంతి కావాలి. మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకునే శాంతియుత పరిస్థితులు కావాలి. కానీ శాంతి కోసం మేం చేస్తున్న విజ్ఞప్తులను ఎవరూ చెవికెక్కించుకోవడంలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉక్రెయిన్ 34వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ రాజధాని కీవ్ లోని ఇండిపెండెన్స్ స్వ్కేర్ నుంచి ప్రజలనుద్దేశించి ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ప్రసంగించారు. 

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఇంకా గెలవలేదని.. అదేవిధంగా ఓడిపోనూలేదన్నారు. ‘‘మాకు కేవలం శాంతి కావాలి. ప్రపంచానికి కూడా ఇది తెలుసు. దీనిని ప్రపంచం కూడా గౌరవిస్తోంది” అని అన్నారు. కాగా, ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కీవ్ లో జరిగిన కార్యక్రమంలో జెలెన్ స్కీతోపాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యూఎస్ స్పెషల్ ఎన్వాయ్ కీత్ కెల్లాగ్ పాల్గొన్నారు. వివిధ దేశాల అధినేతలు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సందేశాలు పంపగా, వాటిని జెలెన్ స్కీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

కొనసాగిన డ్రోన్ దాడులు.. అణు కేంద్రం వద్ద మంటలు.. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య శనివారం రాత్రి కూడా పరస్పరం డ్రోన్ దాడులు కొనసాగాయి. తమ భూభాగంలోని పశ్చిమ కురుస్క్ రీజియన్ లో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. డ్రోన్ దాడితో న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయి మంటలు వ్యాపించాయని, వాటిని వెంటనే అదుపు చేశామని తెలిపింది. లెనిన్ గ్రాడ్ లోని ఓ కీలక పోర్టు వద్ద 10 ఉక్రెయిన్ డ్రోన్ లను కూల్చేశామని, దీంతో నిప్పు రవ్వలు పడి మంటలు చెలరేగగా, ఆర్పివేశామని తెలిపింది. మొత్తం 95 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొంది. అయితే, న్యూక్లియర్ ప్లాంట్ పై తాము దాడి చేశామన్న రష్యా ఆరోపణలు అబద్ధమని ఉక్రెయిన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది.