10 నిమిషాల్లో ఫుడ్​ డెలివరీ: జొమాటో ప్రకటన

10 నిమిషాల్లో ఫుడ్​ డెలివరీ: జొమాటో ప్రకటన

న్యూఢిల్లీ: కొన్ని క్విక్​ కామర్స్​ కంపెనీలు అరగంటలో కిరాణా సామాన్లు డెలివరీ ఇస్తుండగా, తాము కేవలం పదే నిమిషాల్లో ఫుడ్​ డెలివరీ ఇస్తామని జొమాటో ప్రకటించింది. ఇందుకోసం ‘జొమాటో ఇన్​స్టంట్​’ను త్వరలో మొదలుపెడతామని కంపెనీ ఫౌండర్​ దీపిందర్​ గోయల్ ప్రకటించారు. త్వరగా డెలివరీ ఇచ్చేందుకు ఎక్కువ డిమాండ్​ వచ్చే ప్రాంతాల్లో ‘ఫినిషింగ్​స్టేషన్ల’ను ఏర్పాటు చేస్తారు. వీటిలో కనీసం 30 వరకు పదార్థాలు రెడీగా ఉంటాయి. బ్రెడ్, ఆమ్లెట్, చాయ్​, కాఫీ, బిర్యానీ వంటి కొన్ని పదార్థాలను మాత్రమే డెలివరీ ఇస్తారు.

గోయల్​ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడ్డారు. ఎంత త్వరగా డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని, దీనివల్ల డెలివరీ ఏజెంట్లపై విపరీతంగా ఒత్తిడి పడుతుందంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయని ఆందోళన ప్రకటించారు. ఇందుకు గోయల్​ స్పందిస్తూ.. ‘‘పది నిమిషాల్లోనే డెలివరీ ఇవ్వాలని ఏజెంట్లను ఒత్తిడి చేయం. పైనాల్టీలు వేయం. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, కొన్ని రకాల తిండ్లను మాత్రమే వేగంగా డెలివరీ చేస్తాం. డెలివరీ ఏజెంట్లకు రోడ్​ సేఫ్టీపై అవగాహన కల్పించాం. ఇన్సూరెన్స్​ కూడా చేయించాం. గంటలకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా సరిపోతుంది”అని తెలిపారు. మొదట గుర్గావ్​లో ‘ఇన్​స్టంట్​డెలివరీ’ సేవలను అందిస్తామని జొమాటో వర్గాలు తెలిపాయి.