మూడు నెలలకోసారి ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో సీఈవో

మూడు నెలలకోసారి ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో సీఈవో

ఈ రోజుల్లో ఆర్డర్ చేసుకున్న నిమిషాలు, గంటల్లోనే కోరుకున్న భోజనం కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. అయితే అలా ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ లలో ఓ ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో కూడా ఉంటున్నాడట. ఇంతకీ ఆయనెవరనుకున్నారు... జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దీపిందర్ గోయల్‌. ఆయన ప్రతీ మూడు నెలలకొకసారి మిగతా డెలీవరీ బాయ్స్ ల తరహాలో డ్రెస్సప్ అయ్యి ఫుడ్ డెలివరీ చేస్తున్నారట. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ ఆశ్చర్యపోయే విషయాన్ని నౌకరీ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సంజీవ్ బిఖ్‌ చందానీ వెల్లడించారు. ఇటీవల జరిపిన ఒక సంభాషణలో దీపిందర్ గోయల్‌ ఈ విషయం తనకు చెప్పారని బిఖ్ చందానీ తెలిపారు.

ఎరుపు రంగు జొమాటో టీ షర్ట్ ని ధరించి.. మోటార్‌సైకిల్‌పై ఎక్కి ఫుడ్ డెలివరీ చేస్తున్నానని దీపిందర్ గోయల్‌ చెప్పారట. ఆయనే కాదు అదే తరహాలో  సీనియర్ మేనేజర్‌లందరూ డ్రెస్సప్ చేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తున్నారని తెలిపారట. అలా మూడు నెలలకు ఒకసారి తమ జీవితంలో ఒక రోజును అలా గడుపుతున్నారని సంజీవ్ బిఖ్ చందానీ స్పష్టం చేశారు. కానీ ఇంతవరకూ ఎవరూ తనను గుర్తించలేదని దీపిందర్ తనతో చెప్పినట్టు బిఖ్ చందానీ తెలిపారు. ఈ విషయంపై సంజీవ్ బిఖ్ చందానీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దీపిందర్ గోయల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.