డ్యాములు, బ్యారేజీల భద్రతపై ఇరిగేషన్ ఫోకస్!

డ్యాములు, బ్యారేజీల భద్రతపై ఇరిగేషన్  ఫోకస్!
  •     మిగిలిన వాటికీ చేయించాలని అధికారుల నిర్ణయం
  •     బ్రేకింగ్ అనాలిస్, డిజైన్ ఫ్లడ్​పై ఇన్వెస్టిగేషన్స్
  •     వాలంతరీ అధికారులతో డ్యామ్ బ్రేకింగ్ అనాలిసిస్​
  •     డిజైన్ ఫ్లడ్​పై విశ్లేషించనున్న సీడబ్ల్యూసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాములు, బ్యారేజీల భద్రతపై ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. డ్యాముల పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. మంగళవారం జలసౌధలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్​డీఎస్​వో), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని డ్యాములపై రివ్యూ చేశారు. గత ఎస్​డీఎస్​వో, ఓ అండ్ ఎం విభాగాల మినిట్స్​పై చర్చించారు. అప్పుడు తీసుకున్న చర్యలు.. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్షించారు. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం డ్యాములు, బ్యారేజీల భద్రత చేపట్టాలని నిర్ణయించారు. ఈ రివ్యూ మీటింగ్​కు ఈఎన్​సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్​సీ (ఓ అండ్ ఎం) నాగేందర్ రావు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు కూడా హాజరయ్యారు.

చాలా వరకు డ్యామ్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్స్ పెండింగ్​

రాష్ట్రంలో మొత్తం 174 మీడియం, మేజర్ డ్యాములు ఉన్నాయి. వీటిలో కేవలం 25 డ్యాములకే సేఫ్టీ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. మిగిలిన వాటికి చేయాల్సిన అవసరం ఉంది. ఆయా డ్యాములన్నింటికీ డ్యామ్ బ్రేకింగ్ అనాలిసిస్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్, డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్​ వంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలని రివ్యూ మీటింగ్​లో నిర్ణయించారు. డ్యాముల పటిష్టత తెలుసుకునేందుకు చేసే డ్యామ్ బ్రేకింగ్ అనాలిసిస్​ను వాలంతరీ (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్​మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్)కి చెందిన అధికారులతో చేయించనున్నట్టు తెలిసింది. వీరిలో 20 నుంచి 25 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి బ్రేకింగ్ అనాలిసిస్​తో పాటు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్​నూ సిద్ధం చేయించాలని నిర్ణయించారు. ఇటు డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్​ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారులతోనే చేయించాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి పలు మోడల్స్​ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయా డ్యాముల పరిధిలో వస్తున్న ఫ్లడ్ ఎంత? గత 40 ఏండ్లలో వచ్చిన వరద ఎంత? ఆ డ్యాములను ఎంత ఫ్లడ్ కెపాసిటీతో కట్టారు? వంటి వాటిని తేల్చనున్నారు. మరోవైపు కామన్ ప్రాజెక్టులపైనా మహారాష్ట్ర, కర్నాటక అధికారులతోనూ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. నారాయణపూర్ సీఈ సమావేశంలో పాల్గొనగా.. ఆయన నారాయణపూర్ డ్యామ్​కు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఆల్మట్టి ప్రాజెక్టు గురించి అడగ్గా.. తనకు తెల్వదని చెప్పినట్టు సమాచారం.

లిఫ్ట్ స్కీములకు రిపేర్లు

రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా లిఫ్ట్ స్కీముల రిపేర్లపై ఓ అండ్ ఎం సమావేశంలో చర్చించారు. దాదాపు 65 లిఫ్ట్ స్కీములకు చిన్న చిన్న రిపేర్లు చేయించాల్సిన అవసరం ఉందని మీటింగ్​లో అధికారులు చెప్పినట్టు తెలిసింది. కల్వకుర్తి సహా పలు ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు అవసరమని స్పష్టం చేసినట్టు అధికారులు చెప్తున్నరు. మొత్తంగా రూ.కోటి వరకు, ఆ లోపు ఉన్న పనులనే ఓ అండ్ ఎం ద్వారా చేయించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. కోటి రూపాయలపైన ఖర్చయ్యే రిపేర్ల పనులను నేరుగా ప్రభుత్వానికే నివేదించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని చాలా వరకు చెరువులు కూడా పాడైనట్టు అధికారులు చెప్పారు. చెరువుల కెనాల్స్, తూముల దగ్గర రిపేర్లు చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. స్టాఫ్​ మెయింటెనెన్స్​కు సంబంధిం చిన అంశాలపైనా చర్చకు వచ్చినట్టు సమాచారం.