
గౌహతి: అస్సాం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెమాల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందగా, 17 మంది గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రహదార్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు భారీ వృక్షాలు, కరెంట్ స్థంబాలు కూలిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో తీరాన్ని తాకిన రెమాల్ తుఫాను ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అస్సాంలోని పలు జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. కమ్రూప్, నాగావ్, సోనిత్‌పూర్, మోరిగావ్‌లతో సహా 11 జిల్లాల్లో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారుల తెలిపారు.
దిమా హసావో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదీ జలాల ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోవడంతో హఫ్లాంగ్-సిల్చార్ లింక్ రోడ్డు తెగిపోయింది. ఇక, మోరిగావ్‌లో భారీ వర్షాల కారణంగా ఒకరు మరణించారు,మరో నలుగురు గాయపడ్డారు, సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకియాజులి ప్రాంతంలో.. ఉషా ఇంగ్లీష్ స్కూల్ బస్సుపై చెట్టు కొమ్మ విరిగి పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే బస్సులోంచి బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.