కవితకు బెయిల్ ఇవ్వొద్దు

కవితకు బెయిల్ ఇవ్వొద్దు
  •  సాక్షులను బెదిరించారు.. ఆధారాలను ధ్వంసం చేశారు  
  • లిక్కర్ స్కామ్​లో ఆమెనే కింగ్ పిన్ 
  • ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు  
  • ఇది అక్రమ అరెస్టు: కవిత లాయర్ 
  • ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

 న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ అని, ఈ వ్యవహారంలో ఆమెనే ప్రధాన లబ్ధిదారు అని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ, సీబీఐ తెలిపాయి. కీలక ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని చెప్పాయి. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అందువల్ల కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశాయి. 

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే తనను అరెస్టు చేయడానికి సీబీఐకి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. సోమవారం కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించగా.. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. 

నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారు: ఈడీ 

ఈడీ తరఫున సీనియర్ అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ‘‘2022 నవంబర్ 11న కవితకు వ్యతిరేకంగా అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే స్టేట్మెంట్ ఇచ్చిన 118 రోజుల తర్వాత కవిత ఒత్తిడితో పిళ్లై ఆ స్టేట్మెంట్​ను వెనక్కి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 50 ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ కీలక పరిణామం జరిగింది. 2023 మార్చి 9న అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారించాల్సి ఉండగా, ఇంతలో పిళ్లై మాట మార్చారు. 

మేం బలవంతంగా పిళ్లైతో కవిత పేరు చెప్పించి ఉంటే, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన టైమ్​లో పిళ్లై ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు? కవిత బినామీ అయిన అరుణ్ పిళ్లైకి సౌత్ గ్రూప్​కు చెందిన ఇండో స్పిరిట్​లో 33 శాతం వాటాలు ఉన్నాయి. ఇలా పిళ్లై ద్వారా కవిత దాదాపు రూ.35 కోట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారు. ఈ అమౌంట్​ను కవిత కోసం పిళ్లై హోల్డ్​లో పెట్టారు. మరో రూ.4.75 కోట్లు ఇండియా ఎహెడ్ సంస్థకు మళ్లించారు. ఇండియా ఎహెడ్​లో కవిత పెట్టుబడులు పెట్టారు. 

ఇందుకు సంబంధించిన ఆధారాలు, వాట్సాప్ చాట్​లు మా వద్ద ఉన్నాయి. ఈ కంపెనీకి కవిత ఫండింగ్ చేస్తున్నదన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాం” అని తెలిపారు. అలాగే, ఆధారాలను ధ్వంసం చేయడంలోనూ కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ‘‘లిక్కర్ పాలసీ రూపకల్పన టైమ్​లో, ఆ తర్వాత దాదాపు రెండేండ్ల పాటు వినియోగించిన ఫోన్లు సమర్పించాలని పోయినేడాది మార్చి 11న కవితను కోరాం. 

అయితే మార్చి 21న ఆమె 9 ఫోన్లను ఈడీకి అప్పగించారు. ఆ ఫోన్లలో కీలక సమాచారం ఉన్న 4 ఫోన్లను కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఫార్మాట్ చేశారు. మార్చి 14, 15 తేదీల్లో ఈ ఫోన్లను ఫార్మాట్ చేసి, ఆధారాలను క్లీన్ చేసినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది” అని ఈడీ లాయర్ జోహెబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ఇక పిటిషనర్ పేర్కొన్నట్టు కవిత అరెస్ట్​కు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదని చెప్పారు.  

కవిత పవర్ ఫుల్ లేడీ: సీబీఐ 

కేసు ప్రారంభంలో సాక్షిగా ఉన్న కవితను తర్వాత నిందితురాలిగా పేర్కొనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ లాయర్ కోర్టుకు తెలిపారు. ‘‘ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో అప్రూవర్లు, సాక్షులుగా ఉన్న ముగ్గురిని సీబీఐ విచారించింది. లిక్కర్ పాలసీలో భాగస్వామ్యం కోసం కవితను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించినట్టు అప్రూవర్/సాక్షిగా మారిన మాగుంట శ్రీనివాసులు స్టేట్మెంట్ ఇచ్చారు. 

ఇక భాగస్వామ్యంలో భాగంగా శరత్ చంద్రారెడ్డితో కవిత ల్యాండ్ డీల్ చేశారు. అలాగే, శరత్ చంద్రారెడ్డి కొంత అమౌంట్​ను జాగృతి ఎన్జీఓ సంస్థకు ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అందుకే కవితను అరెస్టు చేశాం. కవిత సాధారణ మహిళ కాదు.. ఆమె ఒక పవర్ ఫుల్ లేడీ. ఈ స్కామ్​లో కవితనే కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఒక సాక్షిని బెదిరించారు” అని చెప్పారు. 

కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే, ఈ వాదనలపై కవిత తరఫు అడ్వకేట్ నితేశ్ రాణా అభ్యంతరం తెలిపారు. అరెస్ట్​కు కారణాలు చూపించకుండానే సీబీఐ కవితను అదుపులోకి తీసుకుందన్నారు. కవిత ఎలాంటి ఆధారాలను ధ్వంసం చేయలేదని, ఈడీ కోరినట్టు ఫోన్లు సమర్పించారని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్శ తీర్పును రిజర్వ్ చేశారు. కాగా, వేసవి సెలవులకు ముందే తీర్పు వెలువరిస్తామని జడ్జి తెలిపారు. దీంతో ఈ నెల 30, 31 తేదీల్లో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. 

కేసీఆర్ పేరు లేదు: కవిత లాయర్ 

లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్​కు ముందే తెలుసంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని కవిత లాయర్ మోహిత్ రావు చెప్పారు. కొందరు ఇందులో కేసీఆర్ పేరును చేర్చి, బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన ఆఫీసులో మీడియాతో మోహిత్ రావు మాట్లా డారు. కవిత బెయిల్ పిటిషన్​పై వాదనల సందర్భంగా కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమన్నారు.

 ‘‘మాంగుట రాఘవరెడ్డి తన స్టేట్మెంట్​లో తన తండ్రి మాగుంట శ్రీనివాసులు పేరును ప్రస్తావించారు. అయితే, ఢిల్లీ హైకోర్టులో ఈడీ లాయర్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. మాంగుట రాఘవ రెడ్డి స్టేట్మెంట్ వివరాలను చదివి వినిపించారు. ఈ క్రమంలో రాఘవ రెడ్డి తండ్రికి బదులు కవిత తండ్రి అని (హిస్ ఫాదర్​కు బదులు హర్ ఫాదర్) చదివారు. 

మాగుంట రాఘవ రెడ్డి తండ్రి (శ్రీనివాసులు రెడ్డి)కి కవిత సౌత్ గ్రూప్ లోని సభ్యులను కలిపించారని, ఈ భేటీ మాగుంట శ్రీనివాసులు ఇంట్లో జరిగిందని స్టేట్మెంట్​లో ఉంది. అయితే, ఈడీ లాయర్ తప్పుగా చదవడంతో కేసీఆర్​కు సౌత్ గ్రూప్ సభ్యులను కవిత కలిపించారని, ఈ భేటీ కేసీఆర్ (అప్పట్లో సీఎం అధికారిక నివాసం) నివాసంలో జరిగిందని మీడియాలో ప్రచారం జరిగింది” అని క్లారిటీ ఇచ్చారు.