Kaantha Trailer: ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని.. ఉత్కంఠ రేపుతున్న దుల్కర్ ‘కాంత’ ట్రైలర్

Kaantha Trailer: ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని.. ఉత్కంఠ రేపుతున్న దుల్కర్ ‘కాంత’ ట్రైలర్

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి వరుస చిత్రాలతో మంచి దూకుడు మీదున్నారు హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం దుల్కర్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘కాంత’ (KAANTHA).

దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు. ఈ పీరియడికల్ డ్రామా థ్రిల్లర్ నవంబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ (నవంబర్ 6న) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి తెరకెక్కించిన ఈ సినిమా 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతుంది. ఆనాడు జరిగిన కొన్ని ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. పాత మద్రాస్ సినీ గ్లామర్‌తో పాటు, తెరవెనుక జరిగిన రాజకీయాలు, వివాదాలను కళ్లకు కట్టేలా ఉంది. ‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటూ దుల్కర్‌ చెప్పే డైలాగులు ఆసక్తిరేపుతున్నాయి.

ఒక ఎదుగుతున్న నటుడుకి, అతని స్టార్టింగ్ కెరీర్‌ను తీర్చిదిద్దిన గురువుకి మధ్య జరిగే పోరాటమే కాంతా. విధేయతను పరీక్షించే దిశగా ట్రైలర్ సాగింది. గురువు మెలకువలతో నటుడు స్టార్‌డమ్‌కు చేరుకునే కొద్దీ, ఉమ్మడి కలల ప్రాజెక్ట్ అయిన శాంతాపై ఉద్రిక్తతలు చెలరేగుతాయి. సహకారం అహంకారం, ఆశయం మరియు క్రియేటివ్ డిఫరెన్సెస్ వంటి పరిస్థితులు..ఒక్కసారిగా ఘర్షణగా మారుతాయి.

గురువుపై శిష్యుడు విధేయతకు బదులుగా, యుద్ధం చేయాల్సి రావడానికి గల కారణాలు ఏంటనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. గురువు పాత్రలో సముద్రఖని, శిష్యుడిగా దుల్కర్ మధ్య సాగిన పోరాటం సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ముఖ్యంగా, ఆనాడు ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ ఒక హత్య కేసులో ఇరుక్కున్న అంశాల నుండి దుల్కర్ సల్మాన్ పాత్ర ప్రేరణ పొందినట్టు సినీ వర్గాల టాక్.

అయితే, ఈ పీరియడికల్ థ్రిల్లర్ లో తొలుత దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే, రిలీజైన 'ది రేజ్ ఆఫ్ కాంత', సాంగ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడొచ్చిన కాంత ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది.