మానవ అక్రమ రవాణా ఆరోపణలపై.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

మానవ అక్రమ రవాణా ఆరోపణలపై.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాబీ కటారియాను అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-109లోని అతని నివాసంలో పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) సంయుక్తంగా దాడి చేసి కటారియాను అదుపులోకి తీసుకున్నారు.  ఈ దాడుల్లో పలు అనుమానాస్పద పత్రాలు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బాబీ కటారియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో విదేశీ ఉద్యోగ అవకాశాలను ప్రకటిస్తూ హ్యుమన్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ నడుపుతున్న ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన అరుణ్ కుమార్, హాపూర్‌లోని ధౌలాపూర్‌కు చెందిన మనీష్ తోమర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది మానవ అక్రమ రవాణాదారులతో కలిసి కటారియా.. 150 మందికి పైగా భారతీయులను ట్రాప్ చేసి వారి పాస్‌పోర్ట్‌లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని బందీంచారని.. చైనా కంపెనీ కోసం సైబర్ మోసం కార్యకలాపాలకు వారని బలవంతం చేశారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో గురుగ్రామ్ పోలీసులుఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కటారియాను అరెస్టు చేశారు..

ఉద్యోగ అవకాశాల ప్రకటనతో ప్రభావితమైన బాధితులు కటారియా బృందాన్ని సంప్రదించగా.. వారిని గురుగ్రామ్‌లోని సెక్టార్ 109లోని అతని కార్యాలయానికి పిలిపించారు. అక్కడ వారికి రిజిస్ట్రేషన్ రుసుము రూ. 2 వేలు వసూలు చేసి UAEలో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు కటారియా ఖాతాల్లోకి మూడు విడతలుగా రూ. 3.5 లక్షలను చెల్లించారు.

కటారియా అందించిన టిక్కెట్లపై వియంటియాన్ (లావోస్)కు పంపినట్లు బాధితులు తెలిపారు. అక్కడికి చేరుకోగానే, వారిని కటారియా సహచరుడు వియంటైన్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు.  ఆ తర్వాత ఒక చైనీస్ కంపెనీకి తీసుకెళ్లి.. అక్కడ బాధితుల పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకుని  బందీలుగా ఉంచారు. చట్టవిరుద్ధమైన అమెరికన్ సైబర్ ఫ్రాడ్ కార్యకలాపాలకు సహకరించాలని బాధితులను బలవంతం చేశారు. చివరికి అక్కడి నుంచి తప్పించుకుని భారత రాయబార కార్యాలయానికి బాధితులు చేరుకుని..బాబీ కటారియా, అతని నెట్‌వర్క్‌ గురించి అధికారులకు తెలిపారు. దీంతో గురగ్రామ్ పోలీసులు, ఎన్ఐఏ బృందం దాడి చేసి కటారియాను అరెస్టు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్‌తో సంబంధం ఉన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.