రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు జరపాలి : ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు జరపాలి : ఆర్.కృష్ణయ్య
  • మంత్రి సీతక్కను కోరిన ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాకే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సెక్రటేరియెట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. కులగణనపై త్వరగా నిర్ణయం తీసుకుని, బీసీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారని కృష్ణయ్య తెలిపారు. ఆర్.కృష్ణయ్య వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఉన్నారు.