రండి బాబు రండి.. వంటావార్పు చేసుకోలేని ప్రజానీకానికి తాము అండగా ఉంటాం, ఘుమఘుమలాడే పసందైన ఆహారాన్ని తెచ్చి పెడతాం.. కడుపుబ్బా ఆరగించొచ్చు.. మీరు చేయాల్సిందల్లా మీ అకౌంట్లలో ఉన్న డబ్బు మా ఖాతాల్లోకి బదిలీ చేయటమే.. ఎంత చెల్లిస్తే, అంత మీ కడుపు నిండుద్ది.. ఇలా ప్రజలను మాటలతో బురిడీ కొట్టిస్తూ ఆన్ లైన్ ఫుడ్ డెలివిరీ సంస్థలు కోట్లు వెనకేసుకుంటున్నాయి. అందుకు ఈ కథనం ప్రత్యక్ష ఉదాహరణ.
రూ. 2గా మొదలుపెట్టి..
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో, లాభాలను పెంచుకోవడానికి గతేడాది నుంచి ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ రుసుము వసూలు చేయడం ప్రారంభించింది. ఒక్కో ఆర్డర్‌కు రూ. 2 చొప్పున దీనిని మొదలుపెట్టింది. ఈ నిర్ణయం కంపెనీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గత ఆగష్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్లాట్‌ఫామ్ ఫీజుల ద్వారా రూ. 83 కోట్లు వసూలు చేసినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. జొమాటో రాబడికి ప్లాట్‌ఫారమ్ రుసుము కీలక అంశంగా మారినట్లు సంస్థ తమ నివేదికలో పేర్కొంది. అయితే, రూ. 2గా మొదలైన ప్లాట్‌ఫామ్ ఫీజు, ఇప్పుడు రూ.6కి చేరింది.
కాగా, జూన్ త్రైమాసికంలో జొమాటో నికర లాభం రూ. 253 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. దాంతో, ఆగస్ట్ 2న Zomato షేర్లు 12 శాతానికి పైగా జూమ్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జొమాటో స్టాక్ 12. 24 శాతం పెరిగి రూ.262.74 వద్ద ముగిసింది.
