ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది : మమతా బెనర్జీ

ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది : మమతా బెనర్జీ

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ పాలన ఇలాగే సాగితే.. రాష్ట్రపతి పాలనకు దారి తీసే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీపై ఉందని సీజేఐ యూయూ లలిత్ ను  ఆమె కోరారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్‌) స్నాతకోత్సవ వేడుకకు సీజేఐ లలిత్ వీసీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను మమతా బెనర్జీ కోరారు. ప్రజాస్వామిక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారని బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. మీడియా వారైతే.. ఎవరినైనా నిందిస్తారా అని ప్రశ్నించారు. మన ప్రతిష్టకు భంగం కలిగితే అంతేగా అన్నారు. కొన్ని సంఘటనల్లో తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని మమత చెప్పారు. తాను ఇలా మాట్లాడటం వల్ల  తప్పు అని భావిస్తే.. క్షమించండి అంటూ జస్టిస్ లలిత్ ను కోరారు. ప్రజలు న్యాయవ్యవస్థ పై విశ్వాసం కోల్పోయారని తాను అనడం లేదన్నారు. కాని ప్రస్తుత రోజుల్లో పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు తలుపులు పెట్టుకొని ఏడుస్తున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.