
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూ ఇవ్వనందుకు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన వివాదంలో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించినట్టు తెలుస్తోంది. దాంతో అతడిని దేశంలోని ఏ క్రికెట్ స్టేడియంలోకి అనుమతించబోరు. బోరియాపై సాహా చేసిన ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ సమర్పించిన నివేదికను ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు సమీక్షించింది. ముజుందార్ తప్పు చేశాడని నిర్ధారణకు వచ్చి అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘మజుందార్ ను స్టేడియంలోకి అనుమతించకూడదని అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఆదేశాలు జారీ చేస్తాం. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో అతడికి మీడియా గుర్తింపు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే అతడిని బ్లాక్‌లిస్ట్ లో ఉంచాలని ఐసీసీకి లేఖ రాస్తాం. అతనితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని ప్లేయర్స్‌కు సూచిస్తాం’ అని ఆ అధికారి వెల్లడించారు.