అమెరికాకు ‘డెల్టా’ డేంజర్.. రోజూ లక్షకుపైగా కేసులు

అమెరికాకు ‘డెల్టా’ డేంజర్.. రోజూ లక్షకుపైగా కేసులు
  • అమెరికాకు ‘డెల్టా’ డేంజర్
  • తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ 
  • రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదు 
  • టీకాలతో డెత్స్ మాత్రం తగ్గాయంటున్న నిపుణులు

అమెరికాను  కరోనా ‘డెల్టా’ వేరియంట్​ వణికిస్తోంది. టెక్సస్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. యూఎస్​లో ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన కేసులు పది రోజులుగా పెరుగుతున్నాయి. అక్కడ రోజూ యావరేజ్ గా లక్షకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్టిన్, టెక్సస్, డల్లాస్ సహా అనేక సిటీల్లో ఇన్​పేషెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది.  ఐసీయూ బెడ్లు ఫుల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సగం మందికి వ్యాక్సిన్లు వేయడం వల్ల గతంతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. 

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ స్పీడ్ పెంచింది. టెక్సస్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో కరోనా డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆరు నెలలుగా భారీగా తగ్గిన కేసులు.. ఇప్పుడు డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పెరుగుతున్నయి. దేశవ్యాప్తంగా రోజూ యావరేజ్​గా లక్షకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నయి. ఆస్టిన్, డల్లాస్, సహా అనేక సిటీల్లో దవాఖాన్లలో చేరుతున్న పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో చాలా సిటీల్లో దవాఖాన్లపై ప్రెజర్ మళ్లీ తీవ్రంగా పెరుగుతోంది. లక్షల మంది ఉంటున్న అనేక సిటీల్లో ఐసీయూ బెడ్లు ఫుల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే సగం మందికి టీకాలు వేయడం వల్ల గతంతో పోలిస్తే.. కరోనా పేషెంట్ల మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

టెక్సస్ లో పరిస్థితి సీరియస్ 
టెక్సస్ స్టేట్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇన్ఫెక్షన్లు దాదాపు 40% పెరిగాయని అధికారులు వెల్లడించారు. 2.90 కోట్ల జనాభా ఉన్న టెక్సస్ స్టేట్​లో కేవలం 439 ఐసీయూ బెడ్లు, 6,991 వెంటిలేటర్లు మాత్రమే మిగిలాయి.  ఆస్టిన్​లో 24 లక్షల మంది జనం ఉంటారు. ఈ సిటీలో శనివారం నాటికి 6 ఐసీయూ బెడ్లు, 313 వెంటిలేటర్లు మాత్రమే మిగలడంతో లోకల్​గా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సిటీలో కరోనా రిస్క్ హయ్యెస్ట్ (స్టేజ్ 5) లెవల్ కు చేరిందంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా వ్యాక్సిన్​లు వేయించుకోవాలని, ఇండ్లలోనే ఉండాలని, టీకాలు వేస్కున్నా మాస్కులు పెట్టుకోవాలంటూ సూచించారు. హూస్టన్ లో 67 లక్షల జనం ఉండగా, 41 ఐసీయూ బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 80 లక్షల మంది జనాభా ఉన్న డల్లాస్ లో 110 ఐసీయూ బెడ్లే మిగిలాయి. 

పొంచి ఉన్న మ్యుటేషన్ల ముప్పు 
జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ, బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం.. అమెరికాలో ఆదివారం 24,234 కొత్త కేసులు, 111 డెత్స్ నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో రోజూ లక్షకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి వారం రోజుల్లో వీక్లీ కేసులు 7.50 లక్షలు దాటాయి. కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో కొత్త మ్యుటేషన్లతో మరిన్ని  కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బూస్టర్ డోసుల స్పీడ్ పెంచాలె: ఆంథోనీ ఫౌచీ  
మళ్లీ స్పీడ్ పెంచిన కరోనాను అడ్డుకోవాలంటే బూస్టర్ డోస్ టీకాలను స్పీడప్ చేయాల్సిందేనని బైడెన్ ​చీఫ్ మెడికల్​ అడ్వైజర్​ డాక్టర్​  ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ఫస్ట్​ ఇమ్యూనిటీ తక్కువున్నవాళ్లకు, ఆ తర్వాత సాధారణ ప్రజలకు బూస్టర్ డోసులను ఇచ్చేలా కొత్త స్ట్రాటజీని అమలు చేయాలన్నారు.

చైనాలో పెరుగుతున్న కేసులు 
కరోనాను బాగా కట్టడి చేసిన చైనాలోనూ పోయిన నెల 20 నుంచి కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. సోమవారం నాటి లెక్కల ప్రకారం.. సుమారు 12 సిటీల్లో లోకల్ ట్రాన్స్ మిషన్లతో కేసులు పెరిగాయి. దీంతో నాంజింగ్, యంటాయ్, ఝెంగ్ఝౌ, ఝాంగ్జియాటీ వంటి పలు సిటీల్లో టెస్టులను భారీగా పెంచారు.