కరోనా క్రైసిస్.. భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా నో

కరోనా క్రైసిస్.. భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా నో

వాషింగ్టన్: భారత్‌‌లో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 3 లక్షల పైచిలుకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు సాయం చేయాలని అగ్రరాజ్యం అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. ఆస్ట్రాజెకెకా టీకాతోపాటు అవసరమైన మెడికల్ సప్లయ్‌‌ను భారత్‌కు పంపాలని యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌తోపాటు ప్రముఖ ఇండో-అమెరికన్ నాయకులు, అధికారులు బైడెన్ సర్కార్‌‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే భారత్‌‌కు అవసరమైన టీకా, లైఫ్ సేవింగ్స్ మెడికల్ సప్లయ్‌ను తాము పంపబోమని అమెరికా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా పౌరుల అవసరాలే తమకు ముఖ్యమని యూఎస్ స్టేట్ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన సీనియర్ అధికారి, అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. అమెరికన్ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశ పౌరులను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందన్నారు. కరోనా మందుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించబోమని స్పష్టం చేశారు. కరోనా వల్ల యూఎస్‌‌లో 5.50 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారని, కోటి మందికి పైగా జనాలు ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని చెప్పారు. ప్రపంచంలో యూఎస్‌‌ మాదిరిగా కరోనా వల్ల ప్రభావితమైన మరో దేశం లేదని.. కాబట్టి తమ ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే తమ ముందున్న టార్గెట్ అని పేర్కొన్నారు.