చావు తప్ప మరో మార్గం లేదు : కన్నీళ్లు తెప్పిస్తున్న బీటెక్ స్టూడెంట్ చివరి మాటలు

చావు తప్ప మరో మార్గం లేదు : కన్నీళ్లు తెప్పిస్తున్న బీటెక్ స్టూడెంట్ చివరి మాటలు

చైనీస్ లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేధింపుల కారణంగా బెంగుళూరులోని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'చావు తప్ప నాకు మరో ఆప్షన్ లేదు’ అంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రాణాలను తీసుకున్నాడు. అంతకు ముందు భావోద్వేగంతో కూడిన ఓ సూసైడ్ నోట్‌ రాసిన ఆ విద్యార్థి... తాను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడో స్పష్టంగా తెలియజేశాడు.

“నేను ఏం చేసినా అమ్మా నాన్న క్షమించండి. ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నా పేరు మీద ఉన్న లోన్లు చెల్లించలేకపోతున్నాను. ఇదే నా చివరి నిర్ణయం" అంటూ ఆ విద్యార్థి లేఖలో రాశాడు. ఇతని తేజస్ అనే విద్యార్థిగా గుర్తించిన పోలీసులు.. అతను యలహంకలోని నిట్టే మీనాక్షి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్టు తెలిపారు. స్లైస్ అండ్ కిస్ అనే రుణాలిచ్చే చైనీస్ యాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి పెరుగుతున్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల ఫిర్యాదు ప్రకారం, తేజస్ 'స్లైస్ అండ్ కిస్' అనే చైనీస్ యాప్ నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడని అతని కుటుంబం తెలిపింది. అయితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఇంతలోనే సంఘటన మొత్తం గురించి తెలుసుకున్న తేజస్ తండ్రి గోపీనాథ్... తన కొడుకు తరపున వాయిదాల పద్ధతిలో మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి అంగీకరించాడు.

ఏజెంట్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ, రుణం చెల్లించకపోతే అతని మొబైల్ ఫోన్‌లో  ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తేజస్ మరణానికి మూడు రోజుల ముందు, గోపీనాథ్ బకాయి ఉన్న అప్పును తీర్చేందుకు అదనపు సమయం కావాలని అభ్యర్థించినప్పటికీ, రుణదాతలు వదల్లేదు. జూలై 5న సాయంత్రం, యాప్ ఏజెంట్లు తేజస్‌కు చాలా సార్లు కాల్‌లు చేశారని ఆరోపిస్తూ, అందుకే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.