18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

అమ్మాయిలకు వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయం మంచి ఉదాహరణ అని విమర్శించారు. ‘‘18 ఏళ్ల వయసు ఉన్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు. వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రధానమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ, పెండ్లి మాత్రం చేసుకోకూడదా? సెక్సువల్ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు, లివిన్‌ పార్ట్‌నర్‌‌తో ఉండడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ, వాళ్ల జీవిత భాగస్వామిని ఎంచుకోకూడదా? ఇది చాలా హాస్యాస్పదం’’ అని అసద్ పేర్కొన్నారు. అమ్మాయిల పెండ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలన్నారు.

మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే..

‘‘ఇప్పటికే దేశంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్లలోపే పెళ్లి చేసేస్తున్నారు. కానీ 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతంలో కంటే ప్రస్తుతం కొంత మేర చైల్డ్ మ్యారేజ్‌లు తగ్గాయంటే అందుకు కారణం చదువు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే. చట్టాల వల్ల కాదు. చైల్డ్ మ్యారేజ్‌లు 45 శాతం పేదవాళ్లు చేస్తుంటే.. 10 శాతం మాత్రమే ధనికుల ఇండ్లలో చేస్తున్నారు. ఒక వేళ ప్రధాని మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునే అవకాశాలను పెంచాలి. కంపెనీలు, పరిశ్రమల్లో మహిళా ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గుతున్న ఏకైక దేశం భారత్ మాత్రమే. 2005లో మహిళల వర్క్‌ ఫోర్స్‌ 26 శాతంగా ఉండే 2020లో ఇది 16 శాతానికి పడిపోయింది. వాళ్లకు మంచి విద్య అందించడంతో పాటు వాళ్లు సొంతకాళ్లపై నిలబడే శక్తి కల్పించాలి. బేటీ బచావో.. బేటీ పడావో స్కీమ్‌కు ఇచ్చిన బడ్జెట్‌లో 79 శాతం నిధులను ప్రకటనలకే ఖర్చు పెట్టారు తప్ప బాలికల విద్యపై దృష్టి పెట్టలేదు” అని ఒవైసీ ట్వీట్ చేశారు.

లీగల్ ఏజ్‌ కాదు.. చదువు, ఆర్థిక పురోగతి అవసరం

ఆడ, మగ ఇద్దరినీ 18 ఏళ్లు వచ్చాక వయోజనులుగా, మేజర్లుగా గుర్తిస్తామని, అటువంటప్పుడు కనీస పెండ్లి వయసుల్లో తేడా ఎందుకని  అసదుద్దీన్ ప్రశ్నించారు. వాస్తవానికి లీగల్ ఏజ్‌ అనేది ముఖ్యం కాదని, చదువు, ఆర్థిక పురోగతి అన్నవే ముఖ్యమని చెప్పారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమని, వయోజనుల వ్యక్తిగత హక్కులను సుప్రీం కోర్టు ప్రాథమిక హక్కులుగా గుర్తించిందని తెలిపారు. వాళ్లు ఎప్పుడు పెండ్లి చేసుకోవాలి? ఏ వయసులో పిల్లల్ని కనాలి? అన్నవి వయోజనుల వ్యక్తిగత, ప్రాథమిక హక్కులని అన్నారు.

అమెరికాలో 14, యూకేలో 16 ఏళ్లకే పెండ్లి చేసుకోవచ్చు

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో 14 ఏండ్లకే పెళ్లి చేసుకోవచ్చు, యూకే, కెనడాల్లో పదహారేళ్లకు వివాహం చేసుకోవచ్చు. ఇక న్యూజిలాండ్‌లో 16 నుంచి 19 ఏండ్ల మధ్య వయసులోనే తల్లిదండ్రులు ఆమోదంతో పెండ్లి చేసుకోవచ్చు. ఆ దేశాలు యువతలో మానవ వనరుల అభివృద్ధిని ఆ స్థాయిలో మెరుగుపరిచాయి.  కానీ మోడీ సర్కారు మాత్రం ఆంక్షలు పెట్టి ఏం తినాలి? ఎప్పుడు? ఎవరిని పెండ్లి చేసుకోవాలి? ఏ దేవుడిని పూజించాలి? అన్న ప్రతి దాన్నీ నియంత్రిస్తోంది. ఇకనైనా యువతను చిన్న పిల్లల్లా చూడడం మానేయాలి. వారికే ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి. అందుకే ఎంపీ, ఎమ్మెల్యేలకు కనీస అర్హత వయసు 20 ఏండ్లు చేయాలని నేను ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించా” అని ఒవైసీ సుదీర్ఘ ట్వీట్ చేశారు.