అధికారులను జైల్లో పెడితే.. ఆక్సిజన్​ వస్తదా?

అధికారులను జైల్లో పెడితే.. ఆక్సిజన్​ వస్తదా?
  • ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కరణ విచారణపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన కోర్టు ధిక్కరణ విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఢిల్లీకి 700 టన్నుల మెడికల్​ ఆక్సిజన్​ను సరఫరా చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వ​ అధికారులపై కంటెంప్ట్​ ఆఫ్​ కోర్ట్​ విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో నమోదైన పిటిషన్​ను అత్యవసర విచారణకు స్వీకరించిన జస్టిస్ ​డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఎంఆర్​ షాల బెంచ్​.. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఢిల్లీకి ఆక్సిజన్​ అందదని పేర్కొంది. మే 3 నుంచి ఢిల్లీకి ఇచ్చిన ఆక్సిజన్​ ఎంతో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ప్రాణాలను కాపాడండి
దేశ రాజధానికి ఆక్సిజన్​ సరఫరా పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశం కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. ‘‘మేమూ ఢిల్లీలోనే ఉన్నాం. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోగలం’’ అని జస్టిస్​ చంద్రచూడ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి బాధనూ వింటూనే ఉన్నామన్నారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్​ను ఎలా సరఫరా చేస్తారో గురువారం నాటికి వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు.