నిర్మల్, వెలుగు: విద్యాశాఖ పరిధిలోని నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వ్యర్థం నుంచి అర్థం’ (వెల్త్ ఫ్రమ్ వేస్ట్) వర్క్ షాప్ ఆకట్టుకుంది. జిల్లాలోని 25 హైస్కూళ్ల స్టూడెంట్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొని తాము రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు. ముఖ్యంగా గృహ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాల నుంచి వీరు తయారుచేసిన వస్తువులు ఆలోచింపజేశాయి.
పర్యావరణానికి హాని జరగకుండా రూపొందించిన వస్తువులను చూసిన న్యాయ నిర్ణేతలు విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఎన్జీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్, పర్యావరణవేత్త సంపత్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ మోహన్ రావు, బయోసైన్స్ ఫోరం సభ్యులు గంగా సురేశ్, సుదర్శన్, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
