
- రికవరీ దిశగా అధికారుల అడుగులు
- ఇప్పటికే ముగ్గురిపై వేటు
- పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అధికారులు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు:గజ్వేల్ మున్సిపాలిటీ మెప్మా విభాగంలో మహిళా సంఘాల రుణాల గోల్ మాల్ లెక్క తేలింది. నాలుగు నెలలుగా ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన ప్రత్యేక కమిటీ రూ.1.33 కోట్లు పక్కదారి పట్టాయని నిర్థారించి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీంతో ఇద్దరు మెప్మా ఉద్యోగులపై వేటు వేయగా, ఒక గ్రూపు అధ్యక్షురాలిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గజ్వేల్ మున్సిపాలిటీకి చెందిన 8 మహిళా గ్రూపుల్లోని సభ్యులకు తెలియకుండానే మెప్మాలో పనిచేసే కొందరు ఉద్యోగులు రుణాలను పక్కదారి పట్టించారు. కొన్నిచోట్ల సభ్యుల ఫొటోలను మార్చడం, మరికొన్నిచోట్ల సభ్యుల అవసరానికి మించి రుణాలు ఇచ్చి వాటిని వేరే అకౌంట్లలోకి మళ్లించడం చేశారు.
మరింత లోతుగా విచారణ
ఆడిట్ ఆఫీసర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ప్రాథమిక విచారణను పూర్తి చేసినా అవకతవకలపై మరింత లోతుగా విచారణ చేయడానికి మున్సిపల్ అధికారులు సిద్ధం అవుతున్నారు. రుణాల మంజూరులో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల పరిశీలన సందర్భంగా కొందరు సభ్యుల ఖాతాల నుంచి ఇతర వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బులు మళ్లించారు.
ఇందులో కొన్ని సభ్యుల తీర్మానం ప్రకారం జరగగా మరికొన్ని తీర్మానాలు లేకుండానే జరిగినట్టుగా గుర్తించారు. 8 గ్రూపులకు సంబంధించి 80 మంది నుంచి పూర్తి వివరాలను సేకరిస్తే ఈ గోల్ మాల్ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించ వచ్చని అధికారులు భావిస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అధికారులు
రుణాల అవకతవకలపై మెప్మా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరనున్నారు. బ్యాంకర్లు లోన్లు ఎలా ఇచ్చారు.. నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అనే విషయాలను రాబట్టనున్నారు. పోలీసు విచారణ ప్రకారం బాధ్యులైన ఉద్యోగుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం డబ్బులను రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పక్కదారి పట్టిన రుణాలను రికవరీ చేస్తాం
మహిళా గ్రూపుల రుణాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ చేసి ప్రాథమిక నివేదికను సమర్పించింది. 1.33 కోట్ల అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేయడం కోసం త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అనంతరం వచ్చే నివేదిక ప్రకారం సంబందిత ఉద్యోగుల నుంచి ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారం డబ్బులు రికవరీ చేస్తాం.- బాలకృష్ణ, కమిషనర్, గజ్వేల్ మున్సిపాలిటీ