- చైనా, రష్యా తరహాలో ఏర్పాట్లపై పర్యాటక శాఖ అధ్యయనం
- ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో, వెల్‌నెస్, హస్త కళలు, జల, బౌద్ధ సర్క్యూట్లు..
- మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రెడీ చేసింది. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా ఆరు టూరిస్ట్ జోన్లుగా విభజించి, రూ. 274.93 కోట్లతో 10 జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల వనరుల వద్ద 'గ్లాస్ వ్యూపాయింట్స్' ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. చైనా, రష్యా దేశాల్లో ఉన్న తరహాలో క్యాంటిలీవర్ గ్లాస్ వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ యోచిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను వాటి విశిష్టత ఆధారంగా ఆరు ప్రత్యేక జోన్లుగా విభజించి అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో-వెల్నెస్, హస్తకళలు, జల, బౌద్ధ సర్క్యూట్ల పేరుతో ఈ జోన్లను తీర్చిదిద్దేలా ప్రణాళిక రెడీ చేసింది.
6 సర్క్యూట్లుగా విభజన..
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను వాటి విశిష్టతను బట్టి ఆరు ప్రత్యేక జోన్లుగా విభజించారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, రామప్ప, బాసర, ఆలంపూర్ - సోమశిల, కాళేశ్వరం, మెదక్ వంటి క్షేత్రాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. ఎకో-వెల్నెస్ లో భాగంగా సిద్దిపేట, నల్లమల సర్క్యూట్, శ్రీరామ్ సాగర్, జన్నారం, గిరిజన (ట్రైబల్) సర్క్యూట్, నాగార్జున సాగర్, వికారాబాద్, మహబూబ్ నగర్ ను డెవలప్ చేయనున్నారు. జల సర్క్యూట్లుగా కుంటాల, పొచ్చెర, కొరటికల్, గాయత్రి వంటి జలపాతాలను సుందరీకరించనున్నారు.
వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్ క్లస్టర్, హైదరాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ క్లస్టర్లోని వారసత్వ కట్టడాలకు పూర్వవైభవం తీసుకురానున్నారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల - కొత్తకోటలో హస్తకళలకు జీవపోయనున్నారు. బౌద్ధ సర్క్యూట్లులో భాగంగా కొండాపూర్, ధూళికట్ట, కారుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండకు అభివృద్ధి చేయనున్నారు.
10 జిల్లాలు.. రూ.274.93 కోట్ల కేటాయింపు..
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు 10 జిల్లాల్లో రూ. 274.93 కోట్ల వ్యయంతో వివిధ పర్యాటక ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు రూ.93.12 కోట్లు, మహబూబ్ నగర్ జిల్లాలో రూ.72.38 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ.30.50, రంగారెడ్డి జిల్లాలో రూ.18.96 కోట్లు, కరీంనగర్ రూ.16.20 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ.15.50 కోట్లు, మెదక్ జిల్లాకు రూ.10.00 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు రూ.9.50 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.7.67 కోట్లు, హైదరాబాద్ కు రూ.1.10 కోట్ల నిధులు కేటాయించింది.
అయితే, ఇందులో సింహభాగం నిధులు ఖమ్మం జిల్లాకు కేటాయించడం విశేషం. ఆ తర్వాత మహుబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీమ్‌ల్లో భాగంగా మంజూరవుతున్న నిధులను వినియోగించుకుంటూనే.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో మరిన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
రామప్పలో కాటేజీలు.. సోమశిలలో బోట్లు..
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అదనపు కాటేజీల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కృష్ణా నది తీరంలోని సోమశిల వద్ద పాత బోట్ల స్థానంలో అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్థానిక కళాకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యేకంగా ‘హంపీ థియేటర్ల’ను నిర్మించి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

