
- 5 రోడ్ల అభివృద్ధికి రూ.28.45 కోట్లు
- రాష్ట్ర ప్రణాళిక, గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు
- తీరనున్న వాహనదారుల తిప్పలు
- గిరిజన తండాలకు మెరుగు పడనున్న రవాణా సౌకర్యం
మెదక్/టేక్మాల్/పాపన్నపేట, వెలుగు: దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయడం, అంతర్ జిల్లా రోడ్లను పటిష్ట పరచడం, గిరిజన తండాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. వివిధ స్కీమ్ ల కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోంది. మెదక్ జిల్లాలో టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలో అధ్వాన్నంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారిన పలు రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళిక నిధులు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.28.45 కోట్ల నిధులను మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రణాళిక నిధుల నుంచి పాపన్నపేట మండలం నార్సింగి నుంచి టేక్మాల్ మండల పరిధిలోని గ్రామాల మీదుగా మండల కేంద్రమైన పెద్దశంకరంపేట వరకు ఉన్న రోడ్డు అభివృద్ధి కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయి. పాపన్నపేట మండలం కొత్తపల్లి నుంచి సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చింతకుంట వరకు ఉన్న రోడ్డు పటిష్ట పరచేందుకు రూ.4 కోట్లు, మండల కేంద్రమైన టేక్మాల్ నుంచి ధనూర వరకు ఉన్న రోడ్డు అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ ఎస్ డీ ఎఫ్ నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి వెంకటాపూర్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.3.26 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి వయా సర్మని కుంట తండా, బర్రెంకల కుంట తండా మీదుగా ఎల్లుపేట క్రాస్ రోడ్డు వరకు రోడ్డు అభివృద్ధికి రూ.5.19 కోట్లు మంజూరయ్యాయి.
పనులకు శంకుస్థాపన
రాష్ట్ర ప్రణాళిక నిధులు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రోడ్ల అభివృద్ధి పనులకు ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఆయా పనులు షురూ కానున్నాయి. రెండు, మూడు మండలాలను, పొరుగు జిల్లాలను కలిపే ఆయా రోడ్లకు కనీస మరమ్మతులు చేపట్టక పోవడంతో కంకర తేలి, గుంతలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రోడ్లు అధ్వాన్నంగా మారడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడంతో వాహనదారులకు సంబరపడుతున్నారు.