సంగారెడ్డిలో రూ.500 కోట్లతో వినాయక సాగర్ సుందరీకరణ : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి

 సంగారెడ్డిలో రూ.500  కోట్లతో వినాయక సాగర్ సుందరీకరణ : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి
  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ పునరుద్ధరణ పనులకు రూ .500 కోట్లతో ప్రణాళికలు చేసినట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ రూపకల్పన గురించి హెచ్ఎండీఏ అధికారులు కలెక్టర్ ప్రావీణ్యకు వివరించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్​డబ్ల్యూఎస్, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. వినాయక సాగర్ సుందరీకరణ పనులు వచ్చే వినాయక చవితి, బతుకమ్మ పండుగ లోపు  పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేసినట్టు వెల్లడించారు. వినాయక్ సాగర్ సుందరీకరణ పనులకు  సంబంధించిన వీడియోను, పీపీటీని హెచ్ఎండీ అధికారులు ప్రదర్శించారు. 

బయట నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్  నేరుగా వినాయక సాగర్ లో కలవకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న  25 ఏళ్లకు సరిపోయేలా 23.5 ఎంఎల్ డీ  ట్రీట్ మెంట్ ప్లాంట్, సాగర్ నీటి నాణ్యత పెంచేలా చర్యలు, సాగర్ ను  టూరిజం , రిక్రియేషన్ సెంటర్ గా మార్చేలా ప్రాజెక్ట్ రూప కల్పన, నేషనల్ హైవే నుంచి ఐఐటీ పక్క నుంచి వినాయక్ సాగర్ వరకు 100 ఫీట్ల లింక్ రోడ్ నిర్మాణం, చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వర ఆలయం అభివృద్ధి, బతుకమ్మ ఘాట్, సాగర్ కట్ట వెడల్పు, సైకిల్ ట్రాక్, రెండు లేన్ల బీటీ రోడ్ ఏర్పాటు తోపాటు చెరువు మధ్యలో రూ.20 కోట్లతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడి వరకు కేబుల్  బ్రిడ్జి నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఆయా అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా చర్చించారు. అనంతరం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖల అధికారులు వినాయక సాగర్ ను పరిశీలించారు.