మణుగూరు, వెలుగు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓపెన్ కాస్ట్ 2 మైన్ లో పనిచేస్తున్న షావల్ దగ్ధమై సుమారు రూ.6 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఓపెన్ కాస్ట్ 2 మైన్ లో ఓబీ పనులు నిర్వహిస్తున్న బ్రహ్మపుత్ర షావెల్ శుక్రవారం సెకండ్ షిఫ్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఆపరేటర్ అశోక్ చాకచక్యంగా మంటలనుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
ప్రతి షిఫ్ట్ లో షావల్ మెయింటినెన్స్ లో భాగంగా వాటర్ స్పైయింగ్ చేసి ఆయిల్ లీకేజీలు పరీక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో హోస్ పైప్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్స్ లీకై ఎండ వేడితో పాటు మిషన్ వేడికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఫైర్ సేఫ్టీ సిస్టం కూడా పనిచేయకపోవడంతో బ్రహ్మపుత్ర షావెల్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో సింగరేణికి సుమారు రూ.6 కోట్ల నష్టం జరిగినట్లు తెలిసింది. రెండు రోజుల కింద కూడా రూ. కోటి విలువైన డంపర్ దగ్ధమైనట్లు కార్మికులు తెలిపారు. రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న సింగరేణి అధికారులు క్షేత్రస్థాయిలో రక్షణను మరిచిపోతున్నారని కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఘటనపై వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు.
