- వచ్చే నెల1 నుంచి 3 వరకు ఢిల్లీలో మహాధర్నా
- నల్గొండ ఏఐకేఎస్ మహాసభలో కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి. నల్గొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్లో జరుగుతున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలో మూడోరోజు మంగళవారం ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతు, కార్మిక ఐక్య పోరాటాలు, డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో సీఐటీయూ కార్మిక ఉద్యమంలో భాగస్వామ్యం.. డిసెంబర్, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా గోదాముల ముట్టడించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు బెంగళూరులో వ్యవసాయ కార్మిక సంఘం 11వ జాతీయ
మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
విదేశీ ఒప్పందాలతో రైతుకు ముప్పు
అమెరికా, ఐరోపా సమాఖ్య, న్యూజిలాండ్, బ్రిటన్లతో కేంద్రం చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలతో దేశీయ రైతాంగానికి నష్టం జరుగుతుందని విజ్జు కృష్ణన్ తెలిపారు. మోదీ సర్కారు అదానీ, అంబానీల కోసమే పాలన సాగిస్తోందని.. 2014–2026 మధ్య 5 లక్షల మంది రైతులు, కూలీలు, వలస కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. తెలంగాణలో 32 జిల్లాల్లోని 365 మండలాల్లో సహా 5 రాష్ట్రాల్లో కరువు నెలకొన్నా సాయం అందడం లేదన్నారు. ఆరెస్సెస్ పాలసీలను మోదీ అమలు చేస్తున్నారని, ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు.
ఉపాధి గ్యారెంటీ పోయింది
పేదలకు అండగా ఉన్న నరేగా చట్టాన్ని రద్దు చేసి వీబీ జీ రామ్‌జీ పథకం తేవడంతో ఉపాధి గ్యారెంటీ పోయిందని.. 100 నుంచి 125 పనిదినాల హామీ అమలు కాలేదని విజయరాఘవన్, బి.వెంకట్ విమర్శించారు. పీడీఎస్ బియ్యాన్ని 35 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించారని మండిపడ్డారు. కార్పొరేట్లకు కాకుండా పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
1.58 కోట్లకు చేరిన ఏఐకేఎస్ సభ్యత్వం
మహాసభలో ఇప్పటివరకు 10 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఏఐకేఎస్ సభ్యత్వం 21 లక్షలు పెరిగి 1.58 కోట్లకు చేరింది. మంగళవారం 27 రాష్ట్రాల ప్రతినిధుల చర్చలో.. తెలంగాణ ప్రతినిధి మూడ్ శోభన్ మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీకి రూ.20,600 కోట్ల విడుదల, కొడంగల్ లిఫ్ట్ పరిహారం రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు, అకాల వర్షాలకు ఎకరాకు రూ.10 వేలు, కౌలు రైతుల కమిటీ, ఏజెన్సీలో 4 లక్షల ఎకరాల పోడు పట్టాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పాసుపుస్తకాల సాధన వివరించారు. సమావేశంలో పోతినేని సుదర్శన్, తీగల సాగర్, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పి. వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, ఎంపీ శివదాసన్, విక్రమ్‌సింగ్, వెంకటేశ్వర్లు, వెంకట్రాములు, బోప్పని పద్మ, నారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
