సీఎం సభ అంటే కేటీఆర్‌‌‌‌కు దడ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సీఎం సభ అంటే కేటీఆర్‌‌‌‌కు దడ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  •  కంగారుతోనే సీఎంకు కంగాళీ లేఖలు రాస్తున్నడు
  • 30న సిరిసిల్లలో కేటీఆర్‌‌‌‌ జాతకం బయటపెడ్తం
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఈ నెల 30న సిరిసిల్లలో నిర్వహించనున్న బహిరంగ సభ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌కు దడ పుడుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం సిరిసిల్లకు వస్తే తన హయాంలో జరిగిన విషయాలు ఎక్కడ బయటపడతాయోననే కంగారుతోనే కేటీఆర్ సీఎంకు కంగాళీ లేఖలు రాస్తున్నారని విమర్శించారు.

కేటీఆర్ లేఖపై ఆదివారం ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ నెల 30న సిరిసిల్ల ప్రజల ముందే కేటీఆర్ హయాంలో ఏం జరిగిందో పక్కా లెక్కలతో వివరిస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు. నేతన్నలకు రూ.300 కోట్లకు పైగా బకాయిలు పెట్టిపోయింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. సీఎం వేసే మొదటి అడుగు సిరిసిల్లలో కేటీఆర్ నెత్తిపై, రెండో అడుగు సిద్దిపేటలో హరీశ్‌‌‌‌రావుపై, మూడో అడుగు గజ్వేల్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌పై పడబోతోందని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో గతంలో కేటీఆర్ రాసిన లేఖను కూడా ప్రజలకు గుర్తు చేస్తామని చెప్పారు.

వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆలయ అభివృద్ధిపై ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం సభలో సిరిసిల్లకు గతంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సభకు లక్ష మంది వరకు ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.