అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని కీలకమైన రూల్స్ ఛేంజెస్ అమలులోకి రాబోతున్నాయి. గ్యాస్ వినియోగదారులు, బ్యాంక్ ఖాతాదారులు, ఆలస్యంగా జనన, మరణ ధ్రువపత్రాలు రిజిస్టర్ చేసుకునే వారికి ఈ మార్పులు నేరుగా వర్తించనున్నాయి. వివరాల్లోకి వెళితే..
1. LPG సబ్సిడీకి బయోమెట్రిక్:
అక్టోబర్ 1 నుంచి డొమెస్టిక్ LPG వినియోగదారులు సబ్సిడీ ధరలో సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేయడం తప్పనిసరి. అర్హులైన కుటుంబాలకే సబ్సిడీ అందేలా చూసేందుకు, నకిలీ కనెక్షన్లను ఏరివేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపు 90 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. పూర్తి చేయని వారు సిలిండర్ డెలివరీ సమయంలో.. డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లో లేదా సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ ధ్రువీకరణ చేయని వారికి గ్యాస్ కనెక్షన్ నిలిపివేయరు కానీ.. సబ్సిడీ వర్తించదు. మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
2. ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రూల్స్:
బ్యాంక్ డిపాజిట్ల విషయంలో పారదర్శకతను పెంచేందుకు రిజర్వు బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఒకే తేదీన, ఒకే మొత్తంలో చేసే డిపాజిట్లకు అన్ని బ్రాంచుల్లోని కస్టమర్లకు ఒకే రకమైన వడ్డీ రేట్లు వర్తింపజేయాలని దీని ఉద్దేశ్యం. కస్టమర్లు లేదా బ్రాంచులను బట్టి ఇష్టానుసారంగా వడ్డీ రేట్లను చర్చల ద్వారా నిర్ణయించడానికి వీలు లేదు. వడ్డీ రేట్ల షెడ్యూల్‌ను ముందే అందరికీ అందుబాటులో ఉంచాలి తమ అధికారిక వెబ్ పేజీలో.
3. జనన, మరణాల రిజిస్ట్రేషన్:
జననాలు, మరణాలను నిర్ణీత గడువు దాటి ఆలస్యంగా రిజిస్టర్ చేసుకునే నిబంధనలు మారాయి. ఒక సంవత్సరం దాటి, రెండు సంవత్సరాల లోపు చేసుకునే రిజిస్ట్రేషన్లకు కచ్చితమైన వెరిఫికేషన్ తప్పనిసరి. అదే రెండేళ్లకు మించి ఆలస్యం అయితే.. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉత్తర్వులు అవసరమవుతాయి. తప్పుడు రికార్డులను నివారించడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.
