హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ‘ఇందిరమ్మ’ టవర్స్‌‌..మలక్పేట్ లో త్వరలో భూమిపూజ

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ‘ఇందిరమ్మ’ టవర్స్‌‌..మలక్పేట్ లో త్వరలో భూమిపూజ
  • ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి
  • హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ పరిధిలోని మలక్‌‌పేట్​నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టి, ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన మలక్‌‌పేట్​లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ స్థలాన్ని, నాగోలు బండ్లగూడలో పనుల పురోగతిని పరిశీలించారు. మలక్‌‌పేట్​లో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. పైలట్ ప్రాజెక్టుగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో టవర్స్ నిర్మించనున్నామని, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా త్వరలోనే భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

అనంతరం అధికారులతో, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ప్రాజెక్టు నిర్దేశిత గడువు ఏడాది మాత్రమే ఉన్నందున ఎలాంటి జాప్యం జరగకుండా పనులను నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. పాత భవనాల కూల్చివేతలు వేగవంతం చేసి, నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఫ్లాట్లు దక్కిన లబ్ధిదారులు కూడా నెలకోసారి నిర్మాణ ప్రదేశాలను సందర్శించి, తమ ఇండ్ల నిర్మాణ పురోగతిని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నాగోలు బండ్లగూడలో టవర్స్ పనుల నాణ్యతను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్  రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.-