ప్రజాప్రతినిధుల పెండింగ్‌‌ కేసులపై నివేదికివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రజాప్రతినిధుల పెండింగ్‌‌ కేసులపై నివేదికివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులపై పెండింగ్‌‌  ఉన్న కేసుల వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసుల విచారణ ఏ దశలో ఉంది? ఎప్పటి నుంచి పెండింగ్‌‌లో ఉన్నాయి? పాత కేసులేవి? అనే వివరాలను సంవత్సరాల వారీగా సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సుమోటోగా చేపట్టిన పిటిషన్‌‌పై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

గతేడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలో 284 కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌‌ఖాన్ తెలిపారు. వీటిలో 15 కేసులు పరిష్కారం కాగా, 269 పెండింగ్‌‌లో ఉన్నాయని చెప్పారు. 124 మందికి సమన్లు జారీ అయ్యాయని, మరో 572 మందికి అందాల్సి ఉందన్నారు. 33 కేసులు సాక్షుల విచారణ దశలో ఉండగా, 13 కేసుల్లో నాన్‌‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని వివరించారు. అత్యంత పాత కేసు ఏదని ధర్మాసనం ప్రశ్నించగా, ఆ వివరాలు తన వద్ద లేవని ఏఏజీ బదులిచ్చారు.

వచ్చే విచారణకు సంవత్సరాల వారీగా నివేదిక ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 30 అత్యంత పాత కేసులను గుర్తించి, వాటిలో 10 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కింది కోర్టులను ఆదేశించినట్లు ధర్మాసనం తెలిపింది. కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌‌లో ఉంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది. ఇదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ పిటిషన్‌‌పైనా స్పందించింది. అన్ని కేసులు పెండింగ్‌‌లో ఉండగా, ఒక్క జగన్ కేసులనే త్వరగా విచారించాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఎమ్మెల్సీలను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుల పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తీన్మార్ మల్లన్న పిటిషన్‌‌ను ముగించింది.